‘అభినందన్‌కు పరమవీరచక్ర అవార్డు ఇవ్వాలి’

8 Mar, 2019 17:50 IST|Sakshi

చెన్నై : పాక్‌ చెరలో వేధింపులు ఎదుర్కొన్ని అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన భారత వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్థమాన్‌కు అత్యున్నత సైనిక పురస్కారమైన పరమవీరచక్ర అవార్డు ప్రదానం చేయాలని తమిళనాడు సీఎం పళనిస్వామి శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ప్రతికూల పరిస్థితుల్లో శత్రు సేనలకు చిక్కినా మొక్కవోని విశ్వాసం, సంయమనం పాటించిన ఐఏఎఫ్‌ పైలట్‌ అభినందన్‌కు అత్యున్నత సైనిక పురస్కారం అందించడం సముచితమని ప్రధానికి రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు.

అంతర్జాతీయ సమాజం నుంచి ఎదురైన ఒత్తిడితో పాటు ప్రధాని దౌత్యపరమైన వ్యూహాలతో అభినందన్‌ను పాకిస్తాన్‌ విడుదల చేసిందని చెప్పారు. మాతృదేశం పట్ల అభినందన్‌ ప్రదర్శించిన విశ్వాసం, ప్రతికూల పరిస్థితుల్లోనూ చెదరని సంకల్పం దేశవ్యాప్తంగా కోట్లాది హృదయాలను గెలుచుకుకుందని, పరమవీరచక్ర పురస్కారంతో ఆయనను గౌరవించడం సముచితమని సీఎం పళనిస్వామి ప్రధానికి రాసిన లేఖలో సూచించారు.

కాగా, పుల్వామా ఉగ్రదాడి, సర్జికల్‌ స్ట్రైక్స్‌ నేపథ్యంలో పాక్‌ వైమానిక దాడులను తిప్పి కొట్టే క్రమంలో అభినందన్‌ విమానం కూలిపోగా...ఆయన పాక్‌ భూభాగంలో దిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అనేక పరిణామాల అనంతరం జెనీవా ఒప్పందం ప్రకారం అభినందన్‌ను పాక్‌ భారత్‌కు అప్పగించింది.

మరిన్ని వార్తలు