పనామా జాబితాలో బాలీవుడ్ తారలు

8 Apr, 2016 03:04 IST|Sakshi
పనామా జాబితాలో బాలీవుడ్ తారలు

సైఫ్, కరీనాలతో పాటు కరిష్మా కపూర్ కూడా
* పత్రాల్లో వీడియోకాన్ వేణుగోపాల్ ధూత్ పేరు
* మరో సీఏ, ఆస్ట్రేలియా మైనింగ్ వ్యాపారి కూతురుకూ విదేశీ కంపెనీలు
* తాజా జాబితాలో కొందరు మధ్యతరగతి వ్యాపారులు

న్యూఢిల్లీ: పనామా పేపర్స్ తాజా జాబితాలో మరో  ముగ్గురు బాలీవుడ్ ప్రముఖుల పేర్లు బయటకొచ్చాయి. సైఫ్ అలీఖాన్, ఆయన భార్య కరీనా కపూర్, కరిష్మా కపూర్‌తోపాటు వీడియోకాన్ గ్రూపు అధినేత వేణుగోపాల్ ధూత్‌లు విదేశీ కంపెనీలతో జతకట్టినట్లు తెలిసింది. ముంబైలోని ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్, ఓ టైర్ల కంపెనీ ఓనర్, వస్త్ర దుకాణ యజమాని, ఆస్ట్రేలియా మైనింగ్ వ్యాపారి కూతురు, వస్త్ర ఎగుమతి దారుడు, ఇంజనీరింగ్ కంపెనీ యజమానితోపాటు పలువురు పారిశ్రామికవేత్తల పేర్లు గురువారం విడుదల చేసిన జాబితాలో ఉన్నాయి.
 
సైఫ్, కరీనా, కరిష్మా, వేణుగోపాల్ ధూత్
2010లో ఐపీఎల్ పుణె ఫ్రాంచైజీని కొనుగోలు చేసేందుకు పుణెలోని ప్రముఖ రియల్‌ఎస్టేట్ సంస్థ చోర్డియా గ్రూపు, వీడియోకాన్ గ్రూపు అధినేత వేణుగోపాల్ అవధూతతోపాటు పలువురు బాలీవుడ్ నటులు ఓ కన్సార్షియం (పీ-విజన్ స్పోర్ట్స్)గా ఏర్పడ్డారు. ఈ కన్సార్షియంలో సైఫ్‌కు 9 శాతం, కరీనా, కరిష్మాలకు చెరో 4.5శాతం వాటాలుండగా.. ధూత్‌కు 25 శాతం, చోర్డియా కుటుంబానికి 33 శాతంతోపాటు బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్స్‌కు చెందిన అబ్డ్యురేట్ లిమిటెడ్ కంపెనీకి 15 శాతం వాటా ఉందని తేలింది. వేలంలో పుణె ఫ్రాంచైజీ దక్కకపోవటంతో.. ‘పీ-విజన్ స్పోర్ట్స్’ కంపెనీని వెంటనే మూసేశారని పేపర్స్‌లో వెల్లడైంది. అయితే.. ఈ కన్సార్షియంలో 25 శాతం వాటా తీసుకున్న మాట వాస్తవమేనని అయితే.. అబ్డ్యురేట్ లిమిటెడ్ సంగతి తనకు తెలియదని ధూత్ వ్లెడించారు.
 
ఫొన్సెకాతో ‘కోనేరు’ ఉత్తరప్రత్యుత్తరాలు
పనామాకు చెందిన మొసాక్ ఫోన్సెకాతో ట్రైమెక్స్ గ్రూపునకు చెందిన తెలుగు వ్యాపారవేత్త కోనేరు మధు (దుబాయ్ కేంద్రంగా పలు కంపెనీలు నడుపుతున్నారు) ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపినట్లు తాజా పత్రాల్లో వెల్లడయింది. ఈ కంపెనీ సహకారంతో బీవీఐలో 12 కంపెనీలను కోనేరు రిజిస్టర్ చేశారు. కాగా, 2012లో హైదరాబాద్‌లో దాఖలైన ఎమ్మార్ కేసుకు సంబంధించిన (కేసు నమోదు, బెయిల్ వంటి) వివరాలను కూడా ఫోన్సెకా ప్రతినిధులకు ఎప్పటికప్పుడు మధు వెల్లడించినట్లు ఈ లేఖల్లో ఉంది. దీనిపై మధు తరపు న్యాయవాది మాట్లాడుతూ.. ‘మధు నిబంధనలను పాటించే వ్యక్తి. ఆయన చట్టబద్ధంగానే వ్యాపారాలు నిర్వహిస్తున్నారు’ అని పేర్కొన్నారు.
 
లోకేశ్ శర్మ, టీసీఎం గ్రూపు
తాజా జాబితాలో ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ట్వంటీఫస్ట్ సెంచరీ మీడియా (టీసీఎం) గ్రూపు చైర్మన్ లోకేశ్ శర్మ పేరు కూడా ఉంది. లోకేశ్‌కు బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్స్ (బీవీఐ)లో మూడు కంపెనీలున్నాయని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వెల్లడించింది.  అయితే డీడీసీఏ వివాదంలో జైట్లీతోపాటు టీసీఎం యజమాని లోకేశ్‌పైనా ఆప్ విమర్శలు చేసింది. కాగా, ఢిల్లీకి చెందిన ఉదయ్ ప్రతాప్ సింగ్‌కు బీవీఐలో స్టీల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ అనే కంపెనీలో వాటాలున్నట్లు వెల్లడైంది. ఢిల్లీ వ్యాపారి అలోక్ భాటియా, ఆయన భార్య సిల్వియా భాటియాలకు రెండు కంపెనీలున్నాయి.

ఆస్ట్రేలియా మైనింగ్ వ్యాపారి కూతురైన సిల్వియా.. ఈ కంపెనీల్లో వచ్చిన లాభాలను కోల్ పీటీవై లిమిటెడ్ (ఆస్ట్రేలియా)కు బదిలీ చేసినట్లు వెల్లడైంది. పురుషుల  ఫ్యాషన్ దిగ్గజం జేఎం కంపెనీ యజమాని జానీ మంగ్లానీకి బీవీఐతోపాటు సిప్రస్‌లోనూ పలుకంపెనీలున్నాయని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తెలిపింది. అయితే.. దీనిపై మంగ్లానీ స్పందిస్తూ.. ‘నేను సింగపూర్లో ఉంటున్నాను. నాకు ఏ కంపనీల గురించీ తెలియదు. నా వ్యాపారం (వస్త్ర) నేను చేసుకుంటున్నాను. సింగపూరియన్లను వదిలిపెట్టి అవినీతికి పాల్పడుతున్న భారతీయులు, అక్రమ మార్గాల్లో సంపాదిస్తున్న వారిపై గురిపెట్టండి’ అనిసూచించారు. ఆన్‌లైన్ రిటైలర్ మింత్రా.కామ్ మాజీ వైస్‌ప్రెసిడెంట్ నిష్ భుటానీకీ బీవీఐలో ఆర్ట్స్ అలయెన్స్ మీడియా లిమిటెడ్ కంపెనీలో వాటాలున్నాయి. ఢిల్లీ వ్యాపారవేత్త వినయ్ కృష్ణన్ చౌదరీకి బీవీఐ కేంద్రంగా పనిచేసే రెండు కంపెనీల్లో భాగస్వామ్యం ఉండగా. ముంబైకి చెందిన ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ దిలీప్ జయంతీలాల్ ఠక్కర్‌కు బహమాస్‌లో కన్సు కార్పొరేషన్ కంపెనీ ఉందని వెల్లడైంది.
 
ఫొన్సెకా కంపెనీల్లో మూడోవంతు చైనావే
మొసాక్ ఫొన్సెకా వ్యాపారంలో మూడోవంతు చైనా కంపెనీలేనని ఇంటర్నేషనల్ ఐసీఐజే వెల్లడించింది. ఎంఎఫ్ సలహాతో నడుస్తున్న వాటిలో 16,300 కంపెనీలు చైనా, హాంకాంగ్ దేశస్తులవేనని తెలిపింది. మరోవైపు, బ్యాంకులు షెల్ కంపెనీల యజమానులను సులభంగా గుర్తించేలా కొత్త నిబంధనలు తీసుకురావాలని అమెరికా భావిస్తోంది. వీటి ద్వారా బ్యాంకింగ్ రంగంలోని లొసుగులను గుర్తించి.. జాగ్రత్తపడొచ్చని భావిస్తోంది. మరోవైపు, పనామా పేపర్స్ వివాదంలో యూఈఎఫ్‌ఏ కార్యాలయాల్లో సిట్జర్లాండ్ పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు.
 
‘పనామా’పై న్యాయ విచారణకు డిమాండ్
పనామా పేపర్స్ వివాదంలో వెల్లడవుతున్న భారతీయుల పేర్లపై న్యాయ విచారణ జరిపించాలని కాంగ్రెస్, ఆప్ డిమాండ్ చేశాయి. అయితే.. విదేశాల్లో అక్రమంగా కంపెనీలున్న వారు ఇకపై నిద్రలేని రాత్రులు గడపాల్సిందేనని అరుణ్‌జైట్లీ అన్నారు. కాగా, ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్ కుమారుడు, బీజేపీ ఎంపీ అభిషేక్ సింగ్‌కూ విదేశీ కంపెనీల్లో వాటాలున్నాయని.. కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఆరోపించారు. వీటిని అభిషేక్ ఖండించారు. పనామా జాబితాలో వెల్లడైన 500 మంది భారతీయుల ఆస్తులు దర్యాప్తు చేసేందుకు కేంద్రం వివిధ విభాగాల అధికారులతో ఏర్పాటుచేసిన  దర్యాప్తు బృందం గురువారం ఢిల్లీలో సమావేశమైంది.
 
సామాన్యులకూ కంపెనీలు
చెన్నైలోని ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన షణ్ముగ సుందరపాండియన్‌కు పనాసియా స్టార్ లిమిటెడ్, విర్ ఫ్యాషన్ హోల్డింగ్స్ లిమిటెడ్ అనే రెండు కంపెనీలున్నట్లు తేలింది. సుందరపాండియన్ సోదరుడు చెన్నైలో జర్నలిస్టుగా ఉన్నారు.  కేరళలోని కొబ్బరికాయల చిరు వ్యాపారైన దినేశ్ పరమేశ్వరన్ నాయర్‌కు ఓ విదేశీ కంపెనీలో భాగస్వామ్యం ఉందని తేలింది.

మరిన్ని వార్తలు