పెప్సికోను తాకిన వేడి

2 May, 2016 21:13 IST|Sakshi
పెప్సికోను తాకిన వేడి

పాలక్కడ్: దేశ వ్యాప్తంగా నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతలతో భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. చాలా ప్రాంతాల్లో ప్రజలు త్రాగునీరు దొరక్క తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. మహారాష్ట్రలో నెలకొన్న కరువు పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచ్లను తరలించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు సాఫ్ట్ డ్రింక్ సంస్థ పెప్సీకోను ఈ వేడి తాకుతోంది. కేరళలోని పాలక్కడ్ జిల్లాలో ఉన్న పుథుస్సెరి పెప్సికో ప్లాంట్పై ఆ గ్రామస్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోంది.

గ్రామ ప్రజలు త్రాగునీరు దొరక్క అల్లాడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో సైతం పెప్సికో వారు రోజుకు కొన్ని లక్షల లీటర్ల నీటిని భూమి నుంచి తోడుతుండటంపై ఆందోళన చెందిన పుథుస్సెరి పంచాయితీ సభ్యులు.. పెప్సీకో చర్యలను అడ్డుకోవాలని సోమవారం తీర్మానం చేశారు. దీనిపై కంపెనీకి నోటీసులు అందించాలని వారు నిర్ణయించారు. వారం తరువాత జరగనున్న మరో సమావేశంలో దీనిపై మరింత ముందుకు పోవాలని పుథుస్సెరి వాసులు భావిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు