క్లౌడ్‌ డేటా భారత్‌లోనే..!

5 Aug, 2018 04:19 IST|Sakshi

కేంద్ర ప్రభుత్వ కమిటీ ముసాయిదా నివేదిక

అమెజాన్, మైక్రోసాఫ్ట్‌లాంటి కంపెనీలకు పెద్దదెబ్బ

క్లౌడ్‌ సేవలు ఖరీదుగా మారతాయి: నిపుణులు

న్యూఢిల్లీ: క్లౌడ్‌ కంప్యూటింగ్‌ కంపెనీలకు భారత ప్రభుత్వం షాక్‌ ఇవ్వనుంది. ఆయా సంస్థలు భారతీయుల సమాచారాన్ని భారత్‌లోనే భద్రపరచాలని ఆదేశించనుంది. జాతీయ క్లౌడ్‌ కంప్యూటింగ్‌ విధానం రూపకల్పనకు ఇన్ఫోసిస్‌ సహవ్యవస్థాపకుడు క్రిస్‌ గోపాలకృష్ణన్‌ నేతృత్వంలో కేంద్రం నియమించిన కమిటీ ఇదే తరహా సిఫార్సులతో ముసాయిదా నివేదికను రూపొందించింది. దేశ భద్రత దృష్ట్యా భారతీయుల సమాచారాన్ని విదేశాల్లో కాకుండా భారత్‌లోని డేటా సెంటర్లలోనే స్టోర్‌ చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. వీటిలో ఈ–కామర్స్‌ సైట్లతో పాటు డిజిటల్‌ పేమెంట్‌ విభాగాలనూ చేర్చాలంది. కమిటీ సిఫార్సులకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు చేపడితే అమెజాన్, మైక్రోసాఫ్ట్‌ వంటి దిగ్గజ సంస్థలకు దెబ్బేనని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ్థ  ఫేస్‌బుక్‌ నుంచి ‘కేంబ్రిడ్జ్‌ అనలిటికా’ సంస్థ కోట్లాది మంది వినియోగదారుల సమాచారాన్ని తస్కరించిన నేపథ్యంలో భారతీయుల డేటా స్థానికంగానే ఉండటం మంచిదనే వాదన పెరిగింది.

సత్వర విచారణకు దోహదం..
డేటా సెంటర్లను భారత్‌లోనే ఏర్పాటు చేస్తే నేరాలకు సంబంధించి విచారణ సంస్థలు కేసుల సమాచారాన్ని సులభంగా పొందవచ్చని కమిటీ చెబుతోంది. దీంతో కేసుల విచారణ వేగవంతమవుతుందని అభిప్రాయపడింది. డేటా సెంటర్ల ఏర్పాటుకు దేశంలో అనువుగా ఉన్న 20 ప్రాంతాలను ఎంపిక చేయాలని కోరింది. క్లౌడ్‌ సేవల్ని ఒకే ఛత్రం కిందకు తెచ్చేందుకు ‘నేషనల్‌ క్లౌడ్‌ స్ట్రాటజీ’ని రూపొందించాలని సూచించింది. కేంబ్రిడ్జ్‌ అనలిటికా భారతీయుల సమాచారాన్ని ఫేస్‌బుక్‌ నుంచి దొంగలించిన నేపథ్యంలో కమిటీ ఈ మేరకు పలు సిఫార్సులు చేసింది. కాగా, ఈ ముసాయిదా నివేదికను ఆగస్టు చివర్లో లేదా సెప్టెంబర్‌ 15లోపు కేంద్ర ఐటీ శాఖకు సమర్పిస్తామని గోపాలకృష్ణన్‌ మీడియాకు తెలిపారు. ప్రభుత్వం త్వరలోనే తీసుకురానున్న సమాచార భద్రత చట్టంలో ఈ ప్రతిపాదనలకు చోటుదక్కే అవకాశముందని అభిప్రాయపడ్డారు.  

ప్రతిపాదనలతో నష్టాలేంటి?
ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఈ సిఫార్సులను అమలు చేస్తే క్లౌడ్‌ కంప్యూటింగ్‌ సేవల్లో అగ్రగామిగా ఉన్న అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం సంస్థలు భారత్‌లో తమ డేటా సెంటర్లను ప్రారంభించక తప్పదు. దీంతో క్లౌడ్‌ సేవల ధరలు పెరిగే అవకాశముందని, అంతిమంగా ఇది చిన్న, మధ్య తరహా కంపెనీలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు చెప్పారు. భారత్‌లో విద్యుత్‌ చార్జీలు ఎక్కువగా ఉండటం, డేటా సెంటర్ల కోసం చాలా అనుమతులు తీసుకోవాల్సి రావడం క్లౌడ్‌ కంపెనీలకు ఇబ్బందికరంగా మారవచ్చు. విదేశీ క్లౌడ్‌ కంపెనీలు సైతం కమిటీ నివేదికపై పెదవి విరుస్తున్నాయి.

క్లౌడ్‌ కంప్యూటింగ్‌ అంటే
సాధారణంగా కంపెనీలు తమ సమాచారాన్ని నిల్వ చేయడంతో పాటు కొత్త సాఫ్ట్‌వేర్స్‌ను కొనుగోలు చేయాలంటే భారీగా ఖర్చవుతుంది. దీన్ని పెద్దపెద్ద కంపెనీలు తప్ప చిన్న సంస్థలు భరించలేవు. ఈ నేపథ్యంలోనే క్లౌడ్‌ కంప్యూటింగ్‌ సేవలు పుట్టుకొచ్చాయి. దీనికింద అమెజాన్, మైక్రోసాఫ్ట్‌ వంటి కంపెనీలు చిన్నచిన్న సంస్థలకు సాఫ్ట్‌వేర్స్, సర్వర్లు, డేటాబేస్, నెట్‌వర్కింగ్, స్టోరేజ్‌ సౌకర్యాలను తక్కువ ఫీజుకే అందిస్తాయి. దీనివల్ల ఆయా సంస్థలకు డబ్బులు గణనీయంగా ఆదా అవుతాయి. అంతేకాకుండా క్లౌడ్‌లో సమాచారం అత్యంత సురక్షితంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో చాలావరకూ చిన్న, మధ్య స్థాయి కంపెనీలు క్లౌడ్‌ కంప్యూటింగ్‌ సేవలు పొందేందుకు ప్రాధాన్యమిస్తున్నాయి. ప్రస్తుతం ఈ రంగంలో అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం సంస్థలు ముందంజలో ఉన్నాయి. దీంతో చాలావరకూ భారత కంపెనీల సమాచారం విదేశాల్లోని డేటా సెంటర్లలోనే స్టోర్‌ అవుతోంది.

► భారత్‌లో డేటా సెంటర్లు
    (22 ప్రాంతాల్లో) 141
► వీటిలో ఢిల్లీ, ముంబై,
    బెంగళూరు, హైదరాబాద్,
    చెన్నైలోనే ఉన్నవి 80%
►  2022 కల్లా భారత క్లౌడ్‌ మార్కెట్‌ విలువ రూ.47,964 కోట్లు

>
మరిన్ని వార్తలు