బీడ్ ఉప ఎన్నిక

14 Sep, 2014 22:03 IST|Sakshi
బీడ్ ఉప ఎన్నిక

 ముంబై: బీడ్ లోక్‌సభ నియోజకవర్గానికి నిర్వహించే ఉప ఎన్నికపై దివంగత నాయకుడు గోపీనాథ్ కుమార్తె పంకజా పాల్వేముండే ఆసక్తి చూపడం లేదు. దీంతో ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున బరిలోకి ఎవరు దిగుతారనే విషయం అస్పష్టంగా ఉంది. ప్రస్తుతం పంకజా ‘సంఘర్ష్ యాత్ర’ పేరిట రాష్ర్టవ్యాప్తంగా పర్యటిస్తున్నారు.

రాష్ట్ర రాజ కీయాలపై తనకు ఆసక్తి ఉందనే విషయాన్ని పరోక్షంగా తెలియజేస్తున్నారు. అయితే పంకజ సోదరి ప్రీతమ్ ముండే ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఒకవేళ అదే కనుక జరిగితే ఈ సీటును మళ్లీ బీజేపీకి దక్కించుకోవడం అంత కష్టం కాకపోవచ్చు. ఇందుకు మరో కారణం కూడా ఉంది.

ముండే కుటుంబ సభ్యులెవరైనా ముందుకొస్తే వారికి పోటీగా ఈ నియోజకవర్గంనుంచి తమ పార్టీ తరఫున ఎవరినీ బరిలోకి దించబోమని ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ ఇప్పటికే బహిరంగంగా ప్రకటించారు. దీంతో ఇక్కడ బీజేపీ గెలుపు నల్లేరుపై నడకే కావచ్చని రాజకీయ పండితులు అంటున్నారు. ఇదిలాఉంచితే ప్రీతమ్ ముండే బీడ్ నియోజవర్గం పరిధిలోని పర్లి, బీడ్, నాసిక్ తదితర ప్రాంతాల్లో ఇప్పటికే పర్యటిస్తున్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్సీపీ తరఫున బరిలోకి దిగిన రమేష్ అడస్కర్ ఇప్పటికే బీజేపీలో చేరారు. ఇది కూడా బీజేపీకి కలిసొచ్చే అంశమే.

మరిన్ని వార్తలు