మళ్లీ శశికళ వద్దకు పన్నీర్‌ సెల్వం

12 Dec, 2016 14:32 IST|Sakshi
మళ్లీ శశికళ వద్దకు పన్నీర్‌ సెల్వం
చెన్నై: తమిళనాట ఏఐఏడీఎంకే రాజకీయాలు ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ కేంద్రీకృతంగా మారాయా? అప్పుడే ఆమె పార్టీ పవర్‌ను చేజిక్కించుకున్నారా? ఒక వేళ అదే నిజమైతే, అది జయ మరణం తర్వాతే జరిగిందా.. లేకుంటే ఆమె ఆస్పత్రి పాలయినప్పటి నుంచే తన వ్యూహాన్ని సిద్ధం చేసుకుని పావులు కదిపారా? మొత్తానికి ఏఐఏడీఎంకే భవితవ్యం శశికళ చేతులోకే వెళ్లిపోయిందా.. అంటే ఇటీవల జరుగుతున్న కొన్ని పరిణామాలు అవుననే సంకేతాలను ఇస్తున్నాయి.

ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన ఆమె విశ్వసనీయుడు పన్నీర్‌ సెల్వం శనివారం తన బాధ్యతలు నిర్వర్తించబోతున్నారు. అందులో భాగంగా తొలిసారి రేపు ఉదయం11.30గంటలకు కేబినెట్‌ భేటీ నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే శశికళతో  ఇప్పటికే సమావేశమైన పన్నీర్‌ సెల్వం మరోసారి శుక్రవారం తన మంత్రి వర్గంలోని ఉన్నత శ్రేణి నేతలతో కలిసి పోయెస్‌ గార్డెన్‌కు వెళ్లారు.

అయితే, నేటి భేటీ వెనుక అజెండా ఏమై ఉంటుందనే విషయం మాత్రం బయటకు పొక్కనీయలేదు. అయితే, పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు ఎప్పుడు చేపడతారనే విషయాన్ని తెలుసుకునేందుకే వారు వెళ్లినట్లు ఊహాగానాలు హల్‌ చల్‌ చేస్తున్నాయి. దాదాపు 27 ఏళ్లుగా పార్టీకి అన్నీ తానై జయ నడిపించారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆమె మరణం వరకు కొనసాగారు. దీంతో ఆ పవర్‌ ఫుల్‌ పదవిని ఎప్పుడు, ఎవరు చేపడతారో అని అందరూ ఎదురుచూస్తున్నారు.