దోమలపై సమరం

14 Oct, 2014 23:53 IST|Sakshi
దోమలపై సమరం

 సాక్షి, చెన్నై:రాష్ట్ర వ్యాప్తంగా దోమలపై సమరానికి ప్రభుత్వం సిద్ధమైంది. దోమల నియంత్రణ, సీజన్ వ్యాధుల నివారణ లక్ష్యంగా చర్యలు చేపట్టింది. ఈ మేరకు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సచివాలయంలో మంగళవారం సీనియర్ మంత్రులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోకి మరికొద్ది రోజుల్లో ఈశాన్య రుతు పవనాలు ప్రవేశించనున్నాయి. ఈ ఏడాది ఆ పవనాల రూపంలో వర్షాలు ఆశాజనకంగా ఉంటాయని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దృష్టి పెట్టింది. వర్షం తీవ్రంగా ఉన్న పక్షంలో ప్రజలకు సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా ఇప్పటికే కార్యాచరణను సిద్ధం చేసింది.
 
 ఇక, ఈ వర్షాలకు తోడుగా ప్రతి ఏటా డెంగీ, చికున్‌గునియూ, విషజ్వరాలు ప్రబలుతున్నారుు. దీన్ని పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఓ పన్నీరు సెల్వం ముందు జాగ్రత్తలకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం సచివాలయంలో సీనియర్ మంత్రులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో మంత్రులు నత్తం విశ్వనాథన్, వైద్య లింగం, ఎడపాడి పళనిస్వామి, ఎస్‌పీ వేలుమణి, విజయభాస్కర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్ వర్గీస్, సలహాదారు షీలా బాలకృష్ణన్, గ్రామీణ, నగరాభివృద్ధి, ఆరోగ్య, ప్రజాపనులు, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
 
 రాష్ట్ర వ్యాప్తంగా ఆయా శాఖల నేతృత్వంలో తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా దోమలపై సమరానికి సిద్ధమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా దోమల నియంత్రణే లక్ష్యంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని తీర్మానించారు. డెంగీ, మలేరియా, చికున్‌గునియూ జ్వరాలు ప్రబలకుండా, ప్రజల్ని అప్రమత్తం చేసే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. అవగాహన కార్యక్రమాలతో పాటు ఆరోగ్య శాఖ నేతృత్వంలో కల్పించనున్న వైద్య సేవల గురించి ప్రజలకు వివరించనున్నారు. దోమల్ని నియంత్రించేందుకు ఫాగింగ్ యంత్రాలను ప్రతి గ్రామానికీ అందజేయూలని తీర్మానించారు. దోమలు వృద్ధి ఎక్కడెక్కడ అధికంగా ఉందో గుర్తించి, వాటిని సమూలంగా నాశనం చేసేలా మందులను ప్రయోగించనున్నారు.
 
 సమాచారమివ్వండి
 జ్వరాలు ప్రబలకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించే విధంగా అవగాహన కార్యక్రమాలు విస్త­ృతం చేయూలని ప్రభుత్వం నిర్ణరుుంచింది. ప్రకటనలు, ర్యాలీలు, లఘు చిత్రాల రూపంలో ఈ కార్యక్రమాలు సాగనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైనా జ్వరాల తీవ్రత అధికంగా ఉన్న పక్షంలో తక్షణం సమాచారం అందించేందుకు వీలుగా ప్రత్యేక ఫోన్ నంబర్లను ప్రకటించారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో  పూర్తి స్థాయిలో మందులు నిల్వ ఉండేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు అత్యవసర వైద్య సేవలకు 104 నెంబర్ లేదా, 9444340496, 9361482898, 044- 24350496, 24334810 నంబర్లను సంప్రదించాలని ప్రభుత్వం ప్రకటించింది.
 

మరిన్ని వార్తలు