తూత్తుకుడి స్టెరిలైట్‌ కాపర్‌ ఫ్యాక్టరీ మూత

28 May, 2018 12:50 IST|Sakshi

చెన్నై : స్టెరిలైట్‌ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా తూత్తుకుడిలో సాగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారిన అనంతరం ఆ రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. వేదంత లిమిటెడ్‌కు చెందిన స్టెరిలైట్‌ కాపర్‌ ఫ్యాక్టరీని శాశ్వతంగా మూసివేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఓ పన్నీర్‌సెల్వం చెప్పారు. స్టెరిలైట్‌ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనల్లో, పోలీసుల కాల్పులకు గాయపడ్డ వారిని పన్నీర్‌సెల్వం పరామర్శించారు. ఈ నిరసనల్లో ఇప్పటికీ 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో గాయపడ్డ వారికి నష్టపరిహారం చెల్లిస్తామని ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. 

ఇప్పుడిప్పుడే ఆ ప్రాంతంలో పరిస్థితులు సద్దుమణుగుతున్నాయి. కస్టమర్ల కోసం దుకాణాలు తెరుచుకుంటున్నాయి. మే 23 నుంచి రద్దు చేసిన ఇంటర్నెట్‌ సేవలు కూడా, అక్కడ ఆదివారం అర్థరాత్రి నుంచి పునరుద్ధరించారు. ‘దుకాణాలు తెరుచుకున్నాయి. పరిస్థితి సద్దుమణిగింది. కానీ ఫ్యాక్టరీని మూసివేసే వరకు నగరంలో పూర్తి ప్రశాంతత ఏర్పడదు’ అని తూత్తుకుడి ట్రేడర్స్‌ అసోసియేషన్‌ ఎస్‌ రాజ చెప్పారు. అదేవిధంగా నిరసనకారులపై కాల్పులు జరిపిన పోలీసు అధికారులపై నేర కేసు నమోదు చేయాలని రాజ అన్నారు. 13 మృతదేహాల్లో ఏడుగురికి పోస్టుమార్టం పూర్తి అయిందని రాజ చెప్పారు. మరోవైపు స్టెరిలైట్‌ కాపర్‌ యూనిట్‌ విస్తరణ పనులను నిలిపేయాలని మద్రాస్‌ హైకోర్టు సైతం ఆదేశించింది. 

ఆందోళనల్లో 13 మంది మృతిచెందడంపై తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపికి జాతీయ మానవ హక్కుల కమిషన్‌ నోటీసులు పంపింది. రెండు వారాల్లో నివేదికలు సమర్పించాలని కోరింది. ఈ ఘటనలపై వేదంత రిసోర్సస్‌ చైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ తొలిసారి స్పందించారు. ప్రపంచంలో కేవలం 2 శాతం కాపర్‌ను మాత్రమే భారత్‌ ఉత్పత్తి చేస్తుందని, మిగతా అంతా కెనడా, మధ్యప్రాచ్య, యూరప్‌ నుంచి దిగుమతి చేసుకుంటున్నట్టు తెలిపారు. ఇలాంటివన్నీ భారత్‌లోనే జరుగుతాయని, ప్రతీసారి, ప్రజాస్వామ్యాన్ని ప్రజలు చేతుల్లోకి తీసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. మనం జీవితాంతం దిగుమతి చేసుకునే బతుకుదామా? అని ఆయన ప్రశ్నించారు.   

మరిన్ని వార్తలు