'నాన్న మీరు వెళ్లండి.. నేనొస్తానులే'

30 Sep, 2017 12:44 IST|Sakshi

ముంబయి : 'నాన్నా, మీరు ముందు వెళ్లండి.. కొంచెం జనం తగ్గాక వస్తాను' ఇవి 25 ఏళ్ల శ్రద్దా వార్పే అనే యువతి తన తండ్రితో చివరిసారిగా అన్నమాటలు. శుక్రవారం ముంబైలో దారుణ ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. పరేల్‌ రోడ్, ఎల్ఫిన్‌స్టన్‌ రోడ్డు రైల్వే స్టేషన్లను కలిపే పాదచారుల వంతెన (ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జ్‌)పై భారీ తొక్కిసలాట చోటుచేసుకుంది. ఒకవైపు, భారీ వర్షం కారణంగా బయటకు వెళ్లలేక వంతెనపైనే నిలిచిపోయిన ప్రయాణికులు.. మరోవైపు, వరుసగా వచ్చిన రైళ్లలో నుంచి దిగి ఈ వంతెనపైకే వచ్చేస్తున్న వారితో ఇరుకైన ఆ వంతెన కిక్కిరిసి తొక్కిసలాటకు దారితీసింది.

ఈ హృదయవిదారక ఘటనలో 22 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, గాయపడిన 30 మందిని ఆస్పత్రులకు తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి శవాల గది వద్ద కూర్చొని ఏడుస్తూ కిషోర్‌ వార్పే(57) అనే వ్యక్తి తన కూతురు తనతో చెప్పుకున్న చివరి మాటలు గుర్తు చేసుకున్నారు. తొలుత ఇద్దరు ఆ వంతెనపై నుంచి ముందుకు వెళుతుండగా బాగా ఒత్తిడి ఏర్పడింది. దీంతో ముందు తండ్రిని వెళ్లమని గుంపులో ఆగిపోయింది. సరిగ్గా ఆ సమయంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. అదే సమయంలో బ్రిడ్జ్‌ దాటిన ఆ తండ్రి వెనక్కి వచ్చి చూడగా చనిపోయిన వాళ్ల మధ్య తన కూతురు కనిపించడంతో గుండెలవిసిపోయేలా ఆయన రోధించారు.

మరిన్ని వార్తలు