ముఖమే బోర్డింగ్‌ పాస్‌!

8 Sep, 2018 02:53 IST|Sakshi

బెంగళూరు ఎయిర్‌పోర్టులో ఫేస్‌రికగ్నిషన్‌’

త్వరలోనే బెంగళూరు విమానాశ్రయాల్లో మీ ముఖమే బోర్డింగ్‌ పాస్‌గా మారనుంది. దేశ చరిత్రలో తొలిసారిగా 2019 ప్రథమార్ధంలో బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో ఈ ‘ ఫేస్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీ’ని ప్రారంభించనున్నారు. ముందుగా జెట్‌ ఎయిర్‌వేస్, ఎయిర్‌ ఆసియా, స్పైస్‌జెట్‌ ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వాడుకోనున్నారు. కాగితరహిత విమానప్రయాణ విధానాన్ని ( ఎండ్‌ టు ఎండ్‌ సొల్యూషన్‌ ఫర్‌ పేపర్‌లెస్‌ ఎయిర్‌ ట్రావెల్‌లో భాగంగా) అమలుచేస్తున్న మొదటి ఎయిర్‌పోర్ట్‌గా బెంగళూరు నిలవనుంది.

ఈ సాంకేతికత అమలు ఒప్పందంపై పోర్చుగల్‌లోని లిస్బన్‌లో బెంగళూరు అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ (బీఐఏఎల్‌)–విజన్‌బాక్స్‌ సంస్థలు సంతకాలు చేశాయి.  ‘ఎయిర్‌పోర్ట్‌లో క్యూలైన్‌లో వేచి ఉండే అవసరం లేకుండా, బోర్డింగ్‌ కోసం రిజర్వేషన్, ఇతర ఇబ్బందులు లేకుండా ఇది సాయపడుతుంది’ అని బీఐఏఎల్‌ ఎండీ, సీఈఓ హరి మరార్‌ వ్యాఖ్యానించారు. ఎయిర్‌పోర్టుల్లో రిజిస్ట్రేషన్‌ మొదలుకుని బోర్డింగ్‌ వరకు పేపర్‌రహిత విధానం అమలే లక్ష్యంగా ఈ పద్ధతిని అమలుచేస్తున్నట్టు విజన్‌బాక్స్‌ సంస్థ వెల్లడించింది. ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల ముఖాలను బయోమెట్రిక్‌ టెక్నాలజీ ద్వారా గుర్తించి వారు విమానం ఎక్కేందుకు అనుమతించనున్నట్టు తెలియజేసింది. ఈ టెక్నాలజీ అమల్లోకి వస్తే ఇకపై ఎయిర్‌పోర్ట్‌లో బోర్డింగ్‌పాస్, పాస్‌పోర్టు, వ్యక్తిగత గుర్తింపు కార్డులను పదేపదే చూపాల్సిన అవసరం ఉండదు.

మరిన్ని వార్తలు