పరీక్ష రాసి 100కి 100 మార్కులు వేసుకున్నాడు

15 Jun, 2016 12:22 IST|Sakshi
పరీక్ష రాసి 100కి 100 మార్కులు వేసుకున్నాడు

అహ్మదాబాద్: గుజరాత్లో పన్నెండో తరగతి చదువుతున్న హర్షద్ విద్యార్థి తానే పరీక్ష రాసి.. తానే మార్కులు వేసుకున్నాడు. అది కూడా ఏకంగా 100కు వంద మార్కులు. అచ్చం పరీక్ష పేపర్ దిద్దేవాళ్లలాగానే పేపర్ ఎర్రపెన్నుతో దిద్ది వందకు వంద మార్కులు వేసుకొని పరీక్ష పూర్తయ్యాక సూపర్ వైజర్కు ఇచ్చాడు. దీంతో ఆ విద్యార్థిపై గుజరాత్ సెకండరీ హైయర్ సెకండరీ ఎడ్యుకేషన్ డోర్డు (జీఎస్‌ హెచ్ఎస్ఈబీ) అతడిపై కాపీయింగ్ కేసు పెట్టింది. ఈ విద్యార్థి జాగ్రఫీ, అర్థశాస్త్రం పేపర్లకు తానే పేపర్ దిద్దుకున్నాడని బోర్డు తెలిపింది.

అయితే, తెలివిగా ఈ విద్యార్థి పరీక్ష పేపర్లను దిద్దుకొని మార్కుల మొత్తాన్ని మాత్రం మొదటి పేజీలో వేయకుండా ఏ ప్రశ్నకు సంబంధించిన మార్కులు ఆ సమాధానం వద్దే వేసుకున్నాడు. ఈ విషయం తొలుత గుర్తించని టీచర్లు ఆ విద్యార్థికి మొత్తం 100కు 100 వచ్చినట్లు గణించారు. అయితే, విద్యార్థి రాసిన సమాధాన పత్రానికి ఏడుగురు ఉపాధ్యాయులు ఆమోదం తెలిపే క్రమంలో అతడు చేసిన తప్పును గుర్తించారు. అతడు రాసిన పరీక్ష పత్రాల ప్రకారం వచ్చిన మార్కులు వరుసగా ఎకానిమిక్స్ లో 100/100, గుజరాతీలో 13/100, ఇంగ్లిష్ 12/100, సంస్కృతం 4/100, సోషియాలజీ 20/100, సైకాలజీ 5/100, జాగ్రఫీ 35/100.

మరిన్ని వార్తలు