బడులు తెరవద్దు: తల్లిదండ్రులు

2 Jun, 2020 08:43 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ రావడం లేదా కరోనా పూర్తిగా అదుపులోకి వస్తే తప్ప స్కూళ్లను తెరవవద్దంటూ దేశ వ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులు రెండు లక్షల మంది సంతకాలు చేసిన పిటిషన్‌ ను కేంద్రానికి పంపారు. లాక్‌డౌన్‌ను ఎత్తివేసేందుకు కేంద్రం రూపొందించిన అన్‌లాక్‌ వ్యూహంలో భాగంగా స్కూళ్లు కాలేజీలు ఇతర విద్యాసంస్థలు జూలైలో తెరిచే అవకాశం ఉందని వార్తలు వచ్చిన నేపథ్యంలో పిల్లల తల్లిదండ్రులు ఈ మేరకు పిటిషన్‌ పెట్టారు. కరోనా ఉండగా స్కూళ్లు నిర్వహించడం నిప్పుతో ఆడుకోవడం లాంటిదని చెప్పారు. ఈ లెర్నింగ్‌ ఉపయోగకరమైనదైతే వచ్చే విద్యా సంవత్సరానికి అందులోనే పాఠాలు నిర్వహించాలని కోరారు.

‘జూలైలో పాఠశాలలు తెరవాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైంది కాదు. ఈ సమయంలో స్కూళ్లు తెరవాలని చూడటం అంటే నిప్పుతో చెలగాటం లాంటిది. ప్రస్తుత అకాడెమిక్ సెషన్ ఇ-లెర్నింగ్ మోడ్‌లో కొనసాగాలి. వర్చువల్ లెర్నింగ్ ద్వారా తాము మంచి పని చేస్తున్నామని పాఠశాలలు చెప్పుకుంటే, మిగిలిన విద్యా సంవత్సరంలో కూడా దీన్ని ఎందుకు కొనసాగించకూడదు’ అని పిటిషన్‌లో తల్లిదండ్రులు ప్రశ్నించారు. పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్‌ సెంటర్ల ప్రారంభంపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో సంప్రదింపుల అనంతరం జూలైలో నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఈ మేరకు స్పందించారు.

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా శ్వవిద్యాలయాలు, పాఠశాలలు మార్చి 16 నుంచి మూసివేసిన సంగతి తెలిసిందే. మార్చి 25న దేశవ్యాప్త లాక్‌డౌన్‌ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ముందుగా ఏప్రిల్ 14 వరకు 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించారు. తర్వాత సడలింపులతో దశలవారీగా లాక్‌డౌన్‌ను పొడిగించింది. కంటైన్‌మెంట్‌ జోన్లలో జూన్‌ 30 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకుంది. (కంటైన్‌మెంట్‌ జోన్లలో జూన్‌ 30దాకా లాక్‌డౌన్‌)

>
Poll
Loading...
మరిన్ని వార్తలు