ఇప్పట్లో విద్యార్థులకు పరీక్షలు వద్దు!

15 Jun, 2020 15:08 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ), కౌన్సిల్‌ ఫర్‌ ఇండియన్‌ స్కూల్‌ సర్టిఫికేట్‌ ఎగ్జామినేషన్‌’ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ప్రారంభమైన పది, పన్నెండో తరగతి పరీక్షలు అర్ధాంతరంగా కరోనా వైరస్‌ కారణంగా వాయిదా పడిన విషయం తెల్సిందే. కరోనా వైరస్‌ భారత్‌లో బయట పడిన తర్వాతనే ఈ పరీక్షల షెడ్యూల్‌ ఖరారు చేశారు. మార్చి 25వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో ఈ పరీక్షలను వాయిదా వేయాల్సి వచ్చింది. అప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ పరీక్షలు పూర్తికాగా, కొన్ని రాష్ట్రాల్లో కొన్ని పరీక్షలే జరిగాయి. కొన్ని రాష్ట్రాల్లో పదవ తరగతి పరీక్షలు మొదలే కాలేదు. మొత్తానికి చూస్తే ఎక్కువ పరీక్షలేమిగిలిపోయాయి. 

జూన్‌ 14వ తేదీ నాటికి దేశంలో రోజుకు నమోదవుతున్న కరోనా కేసులు 12 వేలకు చేరుకోగా, దేశంలో మొత్తం కేసులు మూడు లక్షల ముప్పై వేలకు చేరుకుంది. జూలై చివరి నాటికి ఒక్క ఢిల్లీలోనే కరోనా కేసులు ఐదున్నర లక్షలకు చేరుకుంటాయని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇలాంటి ఆందోళనకర పరిస్థితుల్లో ఇప్పట్లో విద్యార్థులకు పది, పన్నెండవ తరగతులకు పరీక్షలే నిర్వహించరాదని, నిర్వహించకుండా పాస్‌ చేసినప్పటికీ విద్యాలయాలను ఇప్పట్లో ప్రారంభించరాదని విద్యావేత్తలు, వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ విషయమై ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పేరెంట్స్‌ కమిటీలు హైకోర్టులను ఆశ్రయించాయి. థర్మో అనలైజర్లు, శానిటైజర్లు, సామాజిక దూరం నిబంధనలు విద్యార్థినీ విద్యార్థుల విషయంలో ఆశించిన ఫలితాలు ఇవ్వలేవని వారంటున్నారు. ఓ తరగతి గదిలో ఒక్కరికి వైరస్‌ సోకినా దాని ప్రభావం ఊహించలేనంతా ప్రమాదకరంగా ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు. 

మరిన్ని వార్తలు