లాక్‌డౌన్ నిబంధనలు వారి ఆశలను చిదిమేసింది

25 Apr, 2020 12:06 IST|Sakshi

ఢిల్లీ : తాము కష్టపడైనా సరే కొడుకును ఉన్నత స్థానంలో ఉంచాలని భావించారు ఆ తల్లిదండ్రులు. అందుకు తగ్గట్టుగానే కొడుకు ఎదికి విదేశాల్లో ఉద్యోగం చేస్తూ ఉన్నత స్థాయికి ఎదిగాడు. అయితే అతను ఎదుగుతున్న తీరును చూసి విధికి కన్ను కుట్టిందేమో.. చిన్న వయసులోనే మృత్యువాతపడ్డాడు. గుండెలవిసేలా రోధిస్తున్న తల్లిదండ్రులు తమ కొడుకు మృతదేహాన్ని కడసారి చూసుకుందామనుకున్నారు. కానీ  అధికారుల నిబంధనలు వారి పాలిట శాపమయింది. చివరకు కొడుకు మృతదేహాన్ని చూడాలనుకునే లోపే అధికారులు రూల్స్‌ పేరుతో  మృతదేహాన్ని తిరిగి పంపించేశారు. ఈ హృదయవిధారక ఘటన ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకుంది. (వైరల్‌గా ‌ మారుతున్న కరోనా పాటలు)

వివరాలు.. ఉత్తరాఖండ్‌లోని గర్హ్వాల్ జిల్లాకు చెందిన 23 ఏళ్ల కమలేష్‌ భట్‌ అబుదాబిలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే వారం క్రితం గుండెపోటు రావడంతో కమలేష్‌ అక్కడే మృతి చెందాడు. దీంతో అక్కడి అధికారులు కమలేష్‌ బంధువులకు సమాచారం అందించి మృతదేహాన్ని ఇండియాకు పంపిస్తున్నట్లు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న కమలేష్‌ బందువులు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లారు. అయితే యూఏఈ నుంచి వచ్చిన కమలేష్‌ మృతదేహానికి అక్కడి భారతీయ ఎంబసీ కార్యాలయం నుంచి తమకు ఎలాంటి సమాచారం అందలేదని ఇమ్మిగ్రేషన్‌ అధికారులు పేర్కొన్నారు. దీంతో వారు కమలేష్‌ మృతదేహాన్ని అ‍ప్పగించేదుకు నిరాకరించారు. అధికారులు నిరాకరించిన కొద్ది గంటల్లోనే మృతదేహాన్ని తీసుకొచ్చిన విమానంలోనే తిరిగి యూఏఈకి తరలించారు.

కరోనా నేపథ్యంలో మార్చి 25 నుంచి లాక్‌డౌన్‌ విధించడంతో పాటు అన్ని రకాల విమాన సేవలను రద్దు చేస్తు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు విదేశాల నుంచి ఎలాంటి విమానాలను అనుమతించొద్దని విదేశాల్లోని అన్ని భారత విదేశాంగ రాయభార కార్యాలయాలకు నివేదికను అందించంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని యూఏఈ నుంచి వచ్చిన విమానాన్ని తాము తిరిగి పంపించినట్లు ఇమ్మిగ్రేషన్‌ అధికారులు పేర్కొన్నారు.

అయితే కమలేష్‌ సోదరుడు విమలేష్‌ భట్‌ మాట్లాడుతూ.. ఇరు దేశాల అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతోనే ఇలా జరిగిందని పేర్కొన్నారు. అయితే కమలేష్‌ మృతి పట్ల యూఏఈ ఉన్న ఇండియన్‌ ఎంబసీ కార్యాలయం కమలేష్‌ మృతిపై తమకు ముందస్తు సమాచారం ఇ‍వ్వలేదని తెలిపారు. ఏప్రిల్‌ 17న కమలేష్‌ పని చేస్తున్న కంపెనీ హెచ్‌ఆర్‌ డిపార్ట్‌మెంట్‌ ఫోన్‌ చేసి మాకు సమాచారం అందించిందన్నారు. కమలేష్‌ మృతదేహాన్ని తిరిగి వెనక్కి రప్పించాలంటే ఇండియన్‌ ఎంబసీ నుంచి ఎన్‌వోసీ  తేవాలని ఇమ్మిగ్రేషన్‌ అధికారులు పేర్కొన్నట్లు విమలేష్‌ వెల్లడించారు. ఈ విషయం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దృష్టికి రావడంతో వారు స్పందిస్తూ.. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. 

మరిన్ని వార్తలు