నా కొడుకు ఏం నేరం చేశాడు.. పాపం చిన్నారి

26 Dec, 2019 10:41 IST|Sakshi

లక్నో: పౌరసత్వ సవరణ చట్టాని(సీఏఏ)కి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు జైలు పాలు కావడంతో ఓ చిన్నారి దిక్కుతోచని పరిస్థితిలో పడింది. ముద్దుచేసే అమ్మానాన్న కనిపించకపోవడంతో రోజూ గుక్కపట్టి ఏడుస్తోంది. వారణాసికి చెందిన ఏక్తా- రవి శేఖర్‌ అనే దంపతులు.. వాయు కాలుష్యం- నివారణ, వాతావరణ మార్పులపై అవగాహన కల్పించేందుకు ఓ ఎన్జీవోను నడుపుతున్నారు. వీరికి కూతురు ఐరా(14 నెలలు) ఉంది. ఈ క్రమంలో నరేంద్ర మోదీ సర్కారు తీసుకువచ్చిన సీఏఏకు వ్యతిరేకంగా.. డిసెంబరు 16న వామపక్షాలు చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమానికి అనుమతి లేదని పేర్కొన్న పోలీసులు దాదాపు 70 మందిని అరెస్టు చేశారు. వీరిలో ఏక్తా, రవి శేఖర్‌ కూడా ఉన్నారు.

ఈ నేపథ్యంలో వారి కుమార్తె ఐరాను బంధువులు తమ ఇంటికి తీసుకువెళ్లారు. అనంతరం తన బామ్మ ఇంటికి పంపించారు. అయితే ఇంతవరకు ఏక్తా, రవి శేఖర్‌కు బెయిలు కూడా లభించకపోవడంతో చిన్నారి తల్లిదండ్రుల రాక కోసం ఎదురుచూస్తూనే ఉంది. ఈ విషయం గురించి ఐరా బామ్మ మాట్లాడుతూ... ‘ నా కొడుకు ఎలాంటి నేరం చేయలేదు. ఐనా పోలీసులు వాడిని ఎందుకు అరెస్టు చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుంది. అసలు తన తల్లిని చూడకుండా పసికందు ఎలా ఉండగలుగుతుంది. నిరసనలను అదుపు చేసే పద్ధతి ఇదేనా అని ప్రశ్నించారు. అదే విధంగా ఐరా పరిస్థితి గురించి మాట్లాడుతూ... ‘తనేం తినడం లేదు. ఏదో విధంగా బుజ్జగించి కొంచెం కొంచెం ఆహారం తినిపిస్తున్నాను. అమ్మా.. నాన్న అంటూ తను ఎప్పుడూ గుమ్మం వైపు చూస్తోంది. వాళ్ల కోసం ఏడుస్తోంది. ఏం చేయాలో మాకు అర్థం కావడం లేదు’అని ఆవేదన వ్యక్తం చేశారు. (చదవండి : పౌరసత్వ చట్టం: ఎందుకీ ఆందోళనలు?)

కాగా సీఏఏకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలతో యూపీ అట్టుడికిపోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఆందోళనకారుల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తిస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా... నిరసన కార్యక్రమంలో చెలరేగిన హింస కారణంగా ప్రభుత్వ ఆస్తులకు జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు దాదాపు రూ. 14.86 లక్షలు చెల్లించాలంటూ... యూపీలో 28 మందికి నోటీసులు అందాయి. అంతేకాదు దెబ్బతిన్న పోలీసు హెల్మెట్లు, లాఠీలు, పెలెట్స్‌ కోసం కూడా  పరిహారం చెల్లించాలని కూడా యోగి సర్కారు ఆదేశించింది. 

పౌరసత్వ సవరణ చట్టం: సమగ్ర కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు