అమెరికాలో పీహెచ్‌డీ.. ఆశ్రమంలో బందీ!

29 Feb, 2020 03:32 IST|Sakshi
సంతోష్‌ రూప

ఆశ్రమం నుంచి మా కూతురును రక్షించండి

ఢిల్లీ హైకోర్టులో ఓ యువతి తల్లిదండ్రుల పిటిషన్‌ 

కేంద్రం, సీబీఐ, ఢిల్లీ ప్రభుత్వానికి కోర్టు నోటీసులు

సాక్షి, న్యూఢిల్లీ: అమెరికాలో పీహెచ్‌డీ పూర్తిచేసి పోస్ట్‌ డాక్టరల్‌ రీసెర్చ్‌ అసోసియేట్‌గా పనిచేసే తన కూతురు ఢిల్లీలోని ఓ ఆధ్యాత్మిక ఆశ్రమంలో బందీగా మారిందని, ఆమెను విడిపించి రక్షించాలంటూ ఓ యువతి తల్లిదండ్రులు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. శుక్రవారం ఈ కేసు విచారించిన ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం.. కేంద్రానికి, ఢిల్లీ ప్రభుత్వానికి, సీబీఐకి నోటీసులు జారీచేసింది. అనంతరం కేసు విచారణను ఏప్రిల్‌ 13కు వాయిదా వేసింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది కె.శ్రవణ్‌కుమార్‌ వాదనలు వినిపించారు.

హైదరాబాద్‌కు చెందిన దుంపల రాంరెడ్డి, మీనావతి కూతురు సంతోష్‌ రూప జేఎన్టీయూ అనంతపురంలో బీటెక్‌ పూర్తి చేసి అమెరికాలోని లూయిస్‌విల్లే వర్సిటీలో 2005 నుంచి 2012 వరకు ఎంఎస్, పీహెచ్‌డీ పూర్తిచేసింది. అనంతరం అక్కడే ఐఓడబ్ల్యూఏ వర్సిటీలో పోస్ట్‌ డాక్టరేట్‌ కోర్సులో చేరింది. పోస్ట్‌ డాక్టరల్‌ రీసెర్చ్‌ అసోసియేట్‌గా కూడా 2015 వరకు పనిచేసింది. 2015 జూలైలో అకస్మాత్తుగా వర్సిటీ విడిచిపెట్టింది. అయితే ఎక్కడికి వెళ్లిందన్న విషయంలో తల్లిదండ్రులకు, ప్రొఫెసర్లకు ఎలాంటి సమాచారం లేదు. అయితే కొంతకాలానికి రూప.. ఢిల్లీ రోహిణీ ప్రాంతంలోని విజయ్‌విహార్‌లో వీరేంద్ర దీక్షిత్‌ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక వర్సిటీ పేరుతో నడుపుతున్న ఆశ్రమంలో ఉన్నట్లు తల్లిదండ్రులకు తెలిసింది.  

బ్యాంకు ఖాతాలో రూ.కోటి 
కాగా, రూప ఆశ్రమంలో చేరేనాటికి ఆమె బ్యాంకు ఖాతాలో దాదాపు కోటి రూపాయలు ఉన్నాయని తల్లిదండ్రులు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. తమ కూతురు కోసం సంప్రదించిన ప్రతిసారి ఆశ్రమ నిర్వాహకులు సంతోష్‌ రూప ఇష్టానికి భిన్నంగా తాము ఒత్తిడి తెస్తున్నామని, తమ నుంచే రక్షణ కావాలని పోలీసులకు ఫిర్యాదు చేసేవారని తెలిపారు. కాగా, ఈ ఆశ్రమంలో అనేక మంది బాలికలు, మహిళలు బందీలుగా ఉన్నారని, వారిని కాపాడాలని 2017లో ఢిల్లీ హైకోర్టులో ఒక రిట్‌ పిటిషన్‌ దాఖలైంది.

ఆ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఓ కమిటీ వేసింది. వందలాది మంది బాలికలు, మహిళలను అక్కడ పశువుల కొట్టాన్ని తలపించేలా ఉంచారని, అక్కడ ఎలాంటి వసతుల్లేవని, వైద్యం కూడా అందట్లేదని, ఇరుకైన సందులు ఉన్నాయని కమిటీలో ఉన్న న్యాయవాది నందితారావు నివేదికలో పేర్కొన్నారు. చాలా మంది డ్రగ్స్‌ అలవాటు పడ్డట్లు కనిపించారని వివరించారు. వారిని చీకటి గదుల్లో ఉంచారని, వారు పడుకునే ప్రాంతంలో కూడా పర్యవేక్షణ ఉండదని, వారికి ఎలాంటి గోప్యత లేదని తెలిపారు. ఆ తర్వాత హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. అయితే వీరేంద్ర దీక్షిత్‌ అదృశ్యమయ్యాడని 2018లో హైకోర్టుకు సీబీఐ తెలిపింది. 

తాము వృద్ధాప్యంలో ఉన్నామని, రూ.2 వేల పెన్షన్‌ డబ్బులతో బతుకుతున్నామని, కూతురిని తీసుకెళ్లేందుకు ఇక్కడే ఢిల్లీలో ఒక గది అద్దెకు తీసుకుని బతుకుతున్నామని తల్లిదండ్రులు పిటిషన్‌లో పేర్కొన్నారు. తమ కూతురు జైలులాంటి వాతావరణంలో ఉండటాన్ని చూసి మానసిక క్షోభతో తమ ఆరోగ్యం మరింత క్షీణిస్తోందని తెలిపారు. తమ బాగోగులు చూసుకునేందుకైనా తమ కూతురును పంపించాలని కోరారు. తమ కూతురు డ్రగ్స్‌కు బానిసై ఉంటుందని, ఆమె ఆరోగ్యంగా లేదని వివరించారు. ఆశ్రమంలో ఆత్మహత్య జరిగినందున తమ కూతురు క్షేమంపై బెంగగా ఉందని వివరించారు.

మరిన్ని వార్తలు