బ్లూవేల్‌ పోయె పబ్‌జి వచ్చె

7 Dec, 2018 11:33 IST|Sakshi

విద్యార్థులను ఊపేస్తున్న కొత్త గేమ్‌ యాప్‌  

గంటలకొద్దీ ఆన్‌లైన్‌లో యుద్ధాలు  

పుట్టుకొస్తున్న మానసిక సమస్యలు

నిమ్హాన్స్‌లో నెలకు 40 కేసులు  

నగరంలోని విద్యారణ్యపురకు చెందిన ఒక అబ్బాయి తరగతిలో ఎప్పుడూ మొదటి మూడు ర్యాంకుల్లో నిలిచేవాడు. కానీ ఇటీవల తరచూ స్కూల్‌కు వెళ్లడం లేదు. మార్కులు తగ్గిపోయాయి. తల్లిదండ్రులతోనూ మాట్లాడడం లేదు. నిరంతరం మొబైల్‌లో, కంప్యూటర్లో  పబ్‌జి గేమ్‌ ఆడడమే.  

మరో 15 ఏళ్ల అబ్బాయి రాత్రి 2–3 గంటలవరకు పబ్‌జి ఆడడం వల్ల ఉదయం ఆలస్యంగా నిద్రలేచి ఆలస్యంగా స్కూల్‌కు వెళుతున్నాడు. గంటల తరబడి మొబైల్‌లో పబ్‌జి గేమ్‌ ఆడుతూ ప్రపంచాన్ని మరచిపోతున్నాడు. గత్యంతరం లేని తల్లిదండ్రులు నిమ్హాన్స్‌ ఆస్పత్రికి తీసుకొచ్చారు.

సాక్షి బెంగళూరు/ యశవంతపుర:   ప్రాణాంతక బ్లూ వేల్‌ గేమ్‌ ముగిసిపోయిందనుకున్న తరుణంలో పబ్‌జి అనే కొత్త గేమ్‌ వచ్చిపడింది. బెంగళూరుతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో బాలలు, కుర్రకారు ఈ ఆటకు బానిసలుగా మారారు. తిండితిప్పలు వదిలేసి మరీఈ గేమ్‌కు అంటుకుపోతూ మానసికంగా దెబ్బతింటున్నారు. విద్యార్థులు విపరీతంగా ఆడడం వల్ల నిద్రలేమీ, స్కూల్‌కు గైర్హాజరు, హింసాత్మక ప్రవృత్తి పెరగడం వంటి మానసిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ గేమ్‌ దూసుకుపోతోంది. 

మూడునెలల్లో 120 కేసులు  
ఈ కొత్త ఆన్‌లైన్‌ గేమ్‌కు బానిసలవుతున్న వారిలో బెంగళూరు ప్రముఖ స్థానం ఉంది. పబ్‌జి గేమ్‌ వ ల్ల మానసకి రుగ్మతలకు గురై ఇటీవల చాలా మం ది నిమ్‌హాన్స్‌కు వస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. గడిచిన మూడు నెలల నుంచి ఇప్పటివరకు నిమ్‌హాన్స్‌లోని సర్వీసెస్‌ ఫర్‌ హెల్తీ యూ జ్‌ ఆఫ్‌ టెక్నాలజీ (షట్‌)కు 120 కేసులు వచ్చినట్లు తెలిపారు. చాలా మంది ఈ గేమ్‌ ఆడిన తర్వాత జీవితంపై ఆసక్తి లేకపోవడం, నిద్ర లేమీ, చదువులో వెనుకబడిపోవడం తదితర మానసిక సమస్యలకు చికిత్స కోసం వస్తున్నారని పేర్కొన్నారు.  

జీవితాన్ని కోల్పోతున్నారు   
‘దేశంలో 8 నెలల క్రితం ఈ గేమ్‌ యాప్‌ ప్రారంభించారు. తొలి మూడు నెలల్లో నెలకు  మూడు లేదా ఐదు కేసులు మాత్రమే వస్తుండేవి. కానీ ఆ తర్వాత సెప్టెంబర్‌ నుంచి కేసుల సంఖ్య పెరగడం గమనించాం. ఇప్పుడు నెలకు సగటున 40 కేసులు ఆస్పత్రికి వస్తున్నాయి. ఈ గేమ్‌ ప్రతిఒక్కరి జీవితాన్ని కబళిస్తోంది. రోజుకు 8 నుంచి 10 గంటలు ఆడడం వల్ల జీవితంలో అన్ని పనులను వదులుకునే స్థాయికి వస్తున్నారు. గేమ్‌కు అలవాటైన పిల్లలను ఫోన్‌కు దూరం చేస్తే చాలా కోపంగా, హింసాత్మకంగా మారిపోతున్నారు. తల్లిదండ్రులతో సత్సంబంధాలు దెబ్బతింటున్నాయి. ఆస్పత్రికి వస్తున్న రోగులు తమ తల్లిదండ్రుల మీదే ఫిర్యాదులు చేస్తున్నారు. ఇలాంటి గేమ్స్‌ బారినపడకుండా తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతూ ఉండాలి. అసహజ వైఖరి, ప్రవర్తన కనిపిస్తే వెంటనే మానసిక వైద్యుల వద్దకు తీసుకెళ్లి కౌన్సెలింగ్‌ ఇప్పించాలి’    – డాక్టర్‌ మనోజ్‌ శర్మ, శ్రీధర్, సైకియాట్రిస్టులు

యుద్ధం చెయ్యడం, చంపడమే ఈ గేమ్‌

 ఇది ఒక యుద్ధానికి సంబంధించిన గేమ్‌. 100 మందితో ఈ గేమ్‌ ప్రారంభమవుతుంది. విమానం నుంచి 100 మంది ఒక ద్వీపంలోకి దిగుతారు. యుద్ధ రంగంలోకి అడుగిడి భారీ తుపాకులు, ఆయుధాలతో గేమ్‌లో ఉన్న ప్రత్యర్థులను చంపుకుంటూ వెళుతుంటారు. బైకులు, కార్లు, బోట్లు ఉపయోగించుకుని ద్వీపంలో తిరుగుతూ దాడులు చేస్తారు.  అలా చంపుకుంటూ వెళ్లి చివరికి ఆ నూరు మందిలో ప్రాణాలతో మిగిలే వారే విజేతలుగా నిలుస్తారు. 

మరిన్ని వార్తలు