మార్కులే సర్వస్వం కాదు..

21 Jan, 2020 04:45 IST|Sakshi
ఢిల్లీలోని తాల్కటోరా స్టేడియంలో విద్యార్థులతో మాట్లాడుతున్న ప్రధాని మోదీ

సాంకేతికతకు బానిసలు కారాదు

‘పరీక్షా పే చర్చా’కార్యక్రమంలో విద్యార్థులకు ప్రధాని మోదీ సూచన

న్యూఢిల్లీ: విద్యార్థులకు పరీక్షలే ప్రధానం కాదనీ, తమ ఆసక్తులను బట్టి విద్యార్థులు ఎదగాలనీ, సాంకేతికతకు బానిసలు కారాదనీ ‘పరీక్షా పే చర్చా’కార్యక్రమంలో ప్రధాని మోదీ విద్యార్థులకు పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలోని తాల్కటోరా స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా హాజరైన విద్యార్థులకు ఆయన కొన్ని సూచనలు చేశారు. తాత్కాలికంగా ఎదురయ్యే అవరోధాలను చూసి ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని ప్రధాని పిల్లలకు హితవు పలికారు. పరీక్షల సమయంలో ఒత్తిడి నుంచి ఎలా బయటపడాలో, పరీక్షల్లో సమయపాలనకు ఏం చేయాలో కొన్ని చిట్కాలు చెప్పారు. క్రికెట్‌ నుంచి మొదలుకొని, చంద్రయాన్‌ –2 ప్రయోగం వరకు స్వీయ అనుభవాల నుంచి నేర్చుకోవాల్సిన గుణపాఠాలను ప్రస్తావించారు.

ప్రతి ఒక్కరూ అత్యాధునిక సాంకేతికతను వినియోగించుకోవాలనీ, అయితే అది మన జీవితాలను శాసించే స్థాయికి చేరకుండా జాగ్రత్తపడాలన్నారు. ‘అత్యంత వేగంగా సాంకేతికాభివృద్ధిలో మార్పులు సంభవిస్తున్నాయి. సాంకేతికతను చూసి భయపడాల్సిన పనిలేదు. శాస్త్ర సాంకేతిక విజ్ఙానం మన స్నేహితుల్లాంటిది. దాన్ని అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ∙కేవలం ఆ పరిజ్ఞానాన్ని అర్థం చేసుకోవడం ఒక్కటే సరిపోదు, దాన్ని అన్వయించడమే ప్రధానమైన విషయం. దాన్ని మనం అధీనంలో ఉంచుకోవాలి తప్ప దాని అధీనంలోకి మనం వెళ్లి సమయాన్ని వృథా చేసుకోరాదు’అంటూ విద్యార్థులకు హితబోధ చేశారు.

నిత్యం ప్రయత్నిస్తూనే ఉండాలి
జయాపజయాలతో నిమిత్తం లేకుండా నిత్యం ప్రయత్నించాల్సిన అవసరాన్ని ప్రస్తావిస్తూ ఆయన.. ‘చంద్రయాన్‌–2 ఆవిష్కరణ విజయవంతమవుతుందన్న గ్యారెంటీ లేకపోయినప్పటికీ లాంచింగ్‌ సమయంలో ఇస్రోలో ఉండాలనుకున్నా. ఆ అనుభవాన్ని ఎన్నటికీ మరిచిపోలేను’అని ఉదహరించారు. ఎలాంటి అననుకూల పరిస్థితుల్లోనైనా రాణించాలని సూచించారు. 2001లో భారత్‌ ఆస్ట్రేలియా టెస్ట్‌ సిరీస్‌లో రాహుల్‌ ద్రవిడ్, వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఏం చేశారు? అని ప్రశ్నించారు. మొత్తం మ్యాచ్‌నే మలుపుతిప్పిన విషయాన్ని ప్రధాని మోదీ గుర్తుచేశారు. పరీక్షల్లో మంచి మార్కులు రావడమొక్కటే సర్వస్వం కాదని గుర్తుంచుకోవాలన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు సైతం పిల్లల ఆకాంక్షలను అర్థం చేసుకోవాలని సూచించారు. పరీక్ష హాలులోకి ప్రవేశించేటప్పుడు ఒత్తిడిని విడనాడాలనీ, ఆత్మ విశ్వాసంతో ఉండి నేర్చుకున్న విషయాలపై దృష్టిసారించాలని ఉద్బోధించారు. దాదాపు 2,000 మంది విద్యార్థులు, అధ్యాపకులు  కార్యక్రమంలో పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు