వాహనాల పార్కింగ్‌ ఫీజు భారీ పెంపు

7 Nov, 2017 17:33 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరంలో తీవ్ర స్థాయికి చేరిన కాలుష్యం ప్రమాద ఘంటికలు మోగించిన నేపథ్యంలో వాహనాల పార్కింగ్‌ ఫీజును నాలుగు రెట్లు పెంచాలని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశ రాజధానిలో పెరిగిపోతున్న వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈ చర్య తీసుకుంది. సుప్రీంకోర్టు నియమించిన ఎన్విరాన్‌మెంట్‌ పొల్యూషన్‌ ప్రివెన్షన్‌ అండ్‌ కంట్రోల్‌ అథారిటీ(ఈపీసీఏ)తో మంగళవారం సమావేశమైన అధికారులు ఈ విషయాన్ని ప్రకటించారు.

ప్రజలు సొంత వాహనాలను వాడకుండా చేసేందుకే ఈ చర్య తీసుకుంటున‍్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న పార్కింగ్‌ ఫీజును నాలుగు రెట్లు పెంచాలని తీర్మానించారు. రాజధానిలో కాలుష్య స్థాయిలు ఒక్కసారిగా పెరిగిపోతుండటంపై అన్ని వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీపావళి తర్వాత ఈ పరిస్థితి మరింత తీవ్రమైంది.

సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈపీసీఏ   కమిటీ సమావేశంలో అధి​కారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.  ప్రైవేటు వాహనాల ఉపయోగాన్ని నిరోధించేందుకు ప్రజారవాణాను  తక్షణమే మెరుగు పర్చాలని ఆదేశించింది. కీలక సమయాల్లో (పీక్‌ అవర్స్‌)  కనీసం పది గంటల పాటు ఢిల్లీ మెట్రో  రేట్లను తగ్గించాలని సిఫారసు చేసింది. అలాగే  వాహనాల సరి-బేసి నంబర్ల   స్కీమ్‌ను పునరుద్ధరించాలని  గ్రీన్‌ ప్యానెల్‌ కోరింది. అలాగే పరిస్థితి మరింత దిగజారకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

మరోవైపు  సాయంత్రానికి  పొల్యూషన్‌పై  ఒకనివేదిక సమర్పించాలని ఢిల్లీ ఉపముఖ్య మంత్రి మనీష్‌ సిసోడియా డిమాండ్‌ చేశారు. దాదాపు  8వేల మాస్క్‌లను సీఐఎస్‌ఎఫ్‌ జవాన్లను పంపిణీ చేసినట్టు తెలుస్తోంది. కాగా ఢిల్లీలో ప్రమాదస్థాయికి చేరిన కాలుష్యంతో తీవ్రమైన పొగమంచు  కప్పేసిందని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ మంగళవారం  హెచ్చరికలు చేసింది.  నేషనల్‌  క్యాపిటల్ రీజియన్‌ లో అతి భయంకరమైన గాలి నాణ్యత  మరింత క్షీణించింది.

మరిన్ని వార్తలు