నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు

11 Dec, 2018 04:26 IST|Sakshi

న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలకు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి వచ్చే ఏడాది జనవరి 8 వరకూ ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా మంగళవారం వెలువడనున్న నేపథ్యంలో సమావేశాలు వాడీవేడిగా సాగనున్నాయి. ఈ సమావేశాల్లో ఆర్బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ రాజీనామా, సీబీఐలో అంతర్గత కుమ్ములాటలు, రఫేల్‌ ఒప్పందంపై కేంద్రాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి.

అయోధ్యలో రామాలయం నిర్మాణంపై మిత్రపక్షం శివసేన నుంచే బీజేపీకి ఇబ్బందులు ఎదురుకానున్నాయి. మరోవైపు అగస్టా కుంభకోణం కేసులో మధ్యవర్తి మిషెల్‌ను దుబాయ్‌ నుంచి భారత్‌కు తీసుకురావడం, విజయ్‌మాల్యా అప్పగింతపై బ్రిటన్‌ కోర్టు తీర్పును ఈ సమావేశాల్లో ఎన్డీయే ప్రధా న అస్త్రంగా వాడుకోనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రిపుల్‌ తలాక్, నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ హోమియోపతి తదితర 45 కీలక బిల్లులను ఈ సమావేశాల్లోనే ఆమోదింపజేసుకోవాలని కేంద్రం కృతనిశ్చయంతో ఉంది.

మరిన్ని వార్తలు