పార్లమెంటు షెడ్యూలులో మార్పులు

4 Jun, 2014 03:11 IST|Sakshi
పార్లమెంటు షెడ్యూలులో మార్పులు

* నేడు గోపీనాథ్ ముండేకు నివాళులర్పించిన అనంతరం లోక్‌సభ రేపటికి వాయిదా
* 5, 6న కొత్త సభ్యుల ప్రమాణం

 
సాక్షి, న్యూఢిల్లీ: 16వ లోక్‌సభ తొలి సమావేశాల షెడ్యూలులో మార్పులు చోటు చేసుకున్నాయి. రోడ్డు ప్రమాదంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గోపీనాథ్ ముండే మృతి చెందిన నేపథ్యంలో ఈ మార్పులు జరిగాయి. ఆ మేర కు బుధవారం లోక్‌సభ సమావేశాలు ఆరంభం కావడానికి ముందుగా సీనియర్ కాంగ్రెస్ ఎంపీ కమల్‌నాథ్‌తో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి భవన్‌లో ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేయిస్తారు. అనంతరం సభ సమావేశమవగానే 16వ లోక్‌సభ ఏర్పాటుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను లోక్‌సభ సెక్రటరీ జనరల్ పి.శ్రీధరన్ చదివి వినిపిస్తారు. ఆ తరువాత ముండేకు సంతాపం తెలియజేస్తూ ఒక తీర్మానాన్ని సభలో ప్రవేశపెడతారు. సభ్యులు నివాళి అర్పిస్తారు.
 
  అనంతరం సభ గురువారానికి వాయిదా పడుతుంది. ఈ నేపథ్యంలో కొత్త సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని గురువారం(5న) చేపడతారు. తొలుత నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం కొత్త సభ్యులు 4, 5 తేదీల్లో ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. అయితే మారిన షెడ్యూలు ప్రకారం.. కొత్త సభ్యులు 5, 6 తేదీల్లో ప్రమాణ స్వీకారం చేస్తారు. సభ్యుల ప్రమాణ స్వీకారం ఆరో తేదీ మధ్యాహ్నం వరకు కొనసాగుతుంది. ఆ తరువాత స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. తిరిగి 9వ తేదీన ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రసంగిస్తారు. 10, 11 తేదీల్లో రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ ఉంటుంది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ముగిసి ఆమోదం పొందిన అనంతరం సభ నిరవధికంగా వాయిదా పడుతుంది. ఈ విషయాలను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు మంగళవారమిక్కడ విలేకరులకు వెల్లడించారు. ప్రొటెం స్పీకర్‌గా సీనియర్ కాంగ్రెస్ ఎంపీ కమల్‌నాథ్ వ్యవహరిస్తారని, ఆయన ఆధ్వర్యంలోనే కొత్త సభ్యుల ప్రమాణస్వీకారం, లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరుగుతుందని తెలిపారు.

మరిన్ని వార్తలు