నవంబర్‌ 18 నుంచి పార్లమెంట్‌!

17 Oct, 2019 03:05 IST|Sakshi

న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాలు సమావేశాలు నవంబర్‌ 18న ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు ప్రభుత్వవర్గాలు సంకేతాలిచ్చాయి. డిసెంబర్‌ 13 వరకు జరిగే అవకాశముందన్నాయి. పార్లమెంటు తేదీల ఖరారుపై పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్‌ కమిటీ బుధవారం కమిటీ అధ్యక్షుడు, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నివాసంలో భేటీ అయింది. సమావేశాల తేదీలపై వచ్చే వారంలో అధికారిక నిర్ణయం వెలువడే అవకాశముంది.

పెద్దల సభలో ఇక సులువే!
విపక్ష పార్టీల ఎంపీల రాజీనామాలతో ఎన్డీయే ప్రభుత్వానికి రాజ్యసభలోనూ సానుకూల పరిస్థితి నెలకొంటోంది. బుధవారం కాంగ్రెస్‌కు మరో ఎంపీ దూరమయ్యారు. శీతాకాల సమావేశాలు మొదలయ్యేలోపు విపక్షాల నుంచి మరి కొందరూ రాజీనామా చేస్తారని బీజేపీ వర్గాలు అంటున్నా యి. కర్ణాటకకు చెందిన కాంగ్రెస్‌ ఎంపీ కేసీ రామమూర్తి బుధవారం పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో రాజ్యసభలో ఆ పార్టీ సభ్యుల సంఖ్య 45కి తగ్గింది.  243 (ఇద్దరు నామినేటెడ్‌ సభ్యులను మినహాయించి) సభ్యుల రాజ్యసభలో ఎన్డీయేకు 106 మంది సభ్యుల మద్దతుంది. మిత్ర పక్షాలుగా భావించే అన్నాడీఎంకేకు 11 మంది, బీజేడీకి ఏడుగురు సభ్యులున్నారు. దీంతో రాజ్యసభలో బిల్లులను విపక్షాలు అడ్డుకునే పరిస్థితులు ఉండవని భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు