ఆర్డినెన్సుల సంప్రదాయం సరికాదు!

24 Jul, 2017 00:58 IST|Sakshi
ఆర్డినెన్సుల సంప్రదాయం సరికాదు!

అత్యవసర పరిస్థితుల్లోనే దీన్ని వాడాలి
► పార్లమెంటు స్తంభనతో విపక్షాలకే నష్టం
► పార్లమెంటేరియన్‌గా జ్ఞాపకాలు మరువలేనివి
► ఎంపీల వీడ్కోలు సమావేశంలో రాష్ట్రపతి ప్రణబ్‌
► మోదీ, ఇందిరపై ప్రణబ్‌ ముఖర్జీ ప్రశంసలు  


న్యూఢిల్లీ: ప్రభుత్వం తరచూ ఆర్డినెన్సులు తీసుకొచ్చే సంప్రదాయాన్ని మానుకోవాలని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ సూచించారు. అత్యవసర పరిస్థితుల్లోనే ఆర్డినెన్సు మార్గాన్ని ఎంచుకోవాలన్నారు. పార్లమెంటులోని సెంట్రల్‌ హాల్లో ఎంపీలంతా కలిసి ఆదివారం ప్రణబ్‌ ముఖర్జీకి వీడ్కోలు సమావేశం ఏర్పాటుచేశారు. ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, ప్రధాని నరేంద్రమోదీ, లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్‌ కుమార్‌లు ప్రణబ్‌ ముఖర్జీకి సెంట్రల్‌ హాల్‌లోకి స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ప్రణబ్‌ మాట్లాడుతూ.. ‘తప్పనిసరి, అత్యవసర పరిస్థితుల్లోనే ఆర్డినెన్సును వినియోగించాలని నేను బలంగా విశ్వసిస్తాను. సాధారణ, ఆర్థికపరమైన అంశాల్లో ఆర్డినెన్సుపై ఆలోచించకూడదు’ అని సూచించారు. పార్లమెంటులో ప్రవేశపెట్టిన అంశాలు లేదా హౌజ్‌ కమిటీ ముందు పెండింగ్‌లో ఉన్న అంశాలపై ఆర్డినెన్సు తీసుకురావటం సరైంది కాదన్నారు.శత్రు ఆస్తుల చట్టం–1968కు సవరణలు తీసుకొచ్చేందుకు విఫలమైన ప్రభుత్వం దీనిపై ఐదుసార్లు ఆర్డినెన్సులు తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో ప్రణబ్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ బిల్లు మార్చినెలలో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే.

మోదీ సహకారం మరువలేనిది
ప్రతి అడుగులోనూ ప్రధాన మంత్రి మోదీ ఇచ్చిన సూచనలు, సహకారం మరువలేనివని ప్రణబ్‌ గుర్తుచేసుకున్నారు. ‘దేశంలో గుణాత్మక పరివర్తన తీసుకొచ్చేందుకు మోదీ బలమైన కాంక్ష, చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనతో ఏర్పడిన బంధం మధుర జ్ఞాపకంగా నిలిచిపోతుంది’ అని రాష్ట్రపతి పేర్కొన్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తనకు మార్గదర్శకత్వం చేశారని గుర్తుచేసుకున్న ప్రణబ్‌.. దృఢచిత్తం, స్పష్టమైన ఆలోచనలు, నిర్ణయాత్మకమైన కార్యాచరణే ఆమెను ఉన్నతమైన వ్యక్తిగా నిలిపాయన్నారు. తప్పును తప్పు అని చెప్పటంలో సంశయించేవారు కాదన్నారు. ఎమర్జెన్సీ తర్వాత లండన్‌లో ఇందిర మాట్లాడుతూ‘ఈ 21 నెలల్లో అన్ని వర్గాల భారతీయులను పరాధీనులుగా మార్చాం’ అని తప్పును ఒప్పుకున్నట్లు ప్రణబ్‌ తెలిపారు.

రచ్చకాదు.. చర్చ జరగాలి
1969లో తొలిసారి పార్లమెంటుకు ఎన్నికయినపుడు అధికార, విపక్షాల్లోని గొప్ప పార్లమెంటేరియన్ల ప్రసంగాలు విని ఎన్నో విషయాలు తెలుసుకున్నట్లు పేర్కొన్నారు. సభలో చర్చలు, వాదోపవాదాలు, భిన్నాభిప్రాయాల విలువ తనకు బాగా తెలుసని రాష్ట్రపతి చెప్పారు. తరచూ పార్లమెంటును స్తంభింప చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలు విపక్షానికే చేటుచేస్తాయని కూడా ప్రణబ్‌ సుతిమెత్తగా హెచ్చరించారు.

‘స్వాతంత్య్రానంతరం దేశ సోదరభావం, గౌరవం, ఐకమత్యాన్ని ప్రోత్సహించేందుకు మనం నిర్ణయించుకున్నాం. ఈ విధానాలే మన దేశానికి ధ్రువతారగా మారాయి’ అని ప్రణబ్‌ పేర్కొన్నారు.  ‘నేను ఎంపీగా ఉన్న రోజుల్లో పార్లమెంటులో చర్చలు, వాదోపవాదాలు జరిగేవి. భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యేవి. పార్లమెంటులో తరచూ ఆందోళనలు జరగటం వాయిదా పడటం వల్ల విపక్షానికే నష్టం జరుగుతుందని అర్థం చేసుకున్నా’ అని ప్రణబ్‌ వెల్లడించారు.‘సప్తవర్ణ శోభితమైన జ్ఞాపకాలు, దేశ ప్రజలకు వినయపూర్వకమైన సేవకుడిగా పనిచేసినందుకు సంతోషకరమైన, సఫలీకృతమైన భావనతో ఈ భవనాన్ని (పార్లమెంటును) వీడుతున్నాను’ అని ప్రణబ్‌ ఉద్వేగంగా తన ప్రసంగాన్ని ముగించారు.

ప్రణబ్‌ గురుసమానులు: సుమిత్ర
రాజ్యాంగం, పార్లమెంటరీ నియమ, నిబంధనలపై పట్టు ఉన్న ప్రణబ్‌ ముఖర్జీ అంటే ఎంపీలకు ఎనలేని గౌరవమని స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ అన్నారు. చాలా మంది పార్లమెంటేరియన్లకు ప్రణబ్‌ గురువులాంటివారన్నారు. ప్రజలంతా దేశ ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు పునరంకితం అవ్వాలని ఆయన తరచూ కోరేవారని హమీద్‌ అన్సారీ గుర్తుచేశారు. ఈ సందర్భంగా ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలో ప్రణబ్‌ ముఖర్జీ పాత్రను ఎంపీలు గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రణబ్‌కు ఎంపీల తరపున ‘కాఫీ టేబుల్‌’ పుస్తకాన్ని స్పీకర్‌ బహూకరించారు.  

న్యూఢిల్లీ: కొత్త రాష్ట్రపతిగా రామ్‌నాథ్‌ కోవింద్‌ బాధ్యతలు చేపడుతున్న నేపథ్యంలో ఢిల్లీలోని రెండు బంగ్లాలు చారిత్రక ప్రాధాన్యం సంతరించు కున్నాయి. మంగళవారం పదవీ విరమణ చేయనున్న రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి ఢిల్లీ రాజాజీ మార్గ్‌లోని 10వ నంబర్‌ భవనం స్వాగతం పలకడానికి ముస్తాబవు తోంది. మాజీ రాష్ట్రపతి కలామ్‌ 2015లో మరణిం చేవరకు ఈ బంగ్లాలోనే నివసించారు.

తర్వాత దీన్ని కేంద్ర మంత్రి మహేశ్‌ శర్మకు కేటా యించారు. భవనాన్ని ప్రణబ్‌కు కేటాయించడంతో శర్మ అక్బర్‌ రోడ్డులోని 10వ నంబర్‌ ఇంటికి  మారారు. యాదృచ్ఛికంగా ఇదే భవనంలో కొత్త రాష్ట్రపతిగా ఎన్నికైన రామ్‌నాథ్‌ కోవింద్‌ తాత్కా లికంగా నివసిస్తుండటం విశేషం. రాష్ట్రపతి ఎన్నిక కోసం నామినేషన్‌ దాఖలు చేసినప్పటి నుంచి ఆయన ఈ బంగ్లాలోనే నివసిస్తున్నారు. 10, అక్బర్‌ రోడ్డు నుంచే కోవింద్‌ రాష్ట్రపతి భవన్‌లోకి  అడుగుపెట్టనున్నారు.

ప్రణబ్‌తో మరువలేని జ్ఞాపకాలు!
న్యూఢిల్లీ: భారత 13వ రాష్ట్రపతిగా తన పదవికి మంగళవారం రాజీనామా చేయనున్న ప్రణబ్‌ ముఖర్జీ వ్యక్తిత్వం, తమతో ఆయన అనుబంధాన్ని పాత మిత్రులు గుర్తుచేసుకుంటున్నారు. రాజకీయ చాణక్యుడిగా, ఆర్థిక, విదేశాంగ విధానాల నిపుణుడిగానే కాదు.. క్లిష్ట సమయాల్లో పార్టీని ఆదుకోవటంలో ప్రణబ్‌ గొప్పదనం మరిచిపోలేనిదంటున్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీతో ఆమె కేబినెట్‌ మంత్రిగా ప్రణబ్‌ మధ్య చాలా కీలకాంశాలపై వ్యక్తిగతంగా చర్చ జరిగేదని.. అంతలా ప్రణబ్‌ను ఇందిర విశ్వసించేవారన్నారు.

‘ఇందిర, ఎమర్జెన్సీకి సంబంధించిన విషయాలపై ఎంత ప్రయత్నించినా ప్రణబ్‌ నోటినుంచి ఒక్క మాట కూడా రాబట్టలేరు’ అని ప్రణబ్‌ ముఖర్జీకి సన్నిహితుడైన జర్నలిస్టు జయంత ఘోష్‌ తెలిపారు. ‘ఆరోగ్య సమస్యలు తలెత్తాక పొగతాగటం మానేశారు. అలవాటు మానుకోలేని కారణంగా నికోటిన్‌ లేకున్నా ఉట్టి పైప్‌లనే నోట్లో పెట్టుకునేవారు’ అని ఘోష్‌ గుర్తుచేసుకున్నారు. ముఖ్యనేతలు, దేశాధినేతలు, విదేశీ ప్రముఖులు బహుమతులుగా ఇచ్చిన 500కు పైగా పైప్‌ల కలెక్షన్‌ను రాష్ట్రపతి భవన్‌ మ్యూజియంకు ప్రణబ్‌ కానుకగా ఇచ్చారు.

‘ప్రణబ్‌కు రాజకీయాలతోపాటు దేశ ఆర్థిక వ్యవస్థ గురించి చాలాబాగా తెలుసు. ప్రభుత్వానికి సమస్యలు రానీయకుండా రాజ్యాంగాన్ని కాపాడటం కూడా ఆయనకు తెలుసు. భారత అత్యుత్తమ రాష్ట్రపతుల్లో ఆయన ఒకరు’ అని కేంద్ర కేబినెట్‌లో మాజీ సహచరుడు శివ్‌రాజ్‌ పాటిల్‌ తెలిపారు. రక్షణ, ఆర్థిక, విదేశాంగ, హోం వంటి వివిధ శాఖల బాధ్యతలు నిర్వహించినా ప్రభుత్వంలో ఆయనే ఎప్పుడూ నెంబర్‌ 2గా ఉండేవారన్నారని మరికొందరు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు