రాజీనామా చేయాల్సిందే.. వాళ్లు చేయరు!

3 Aug, 2015 14:52 IST|Sakshi

న్యూఢిల్లీ:  అధికార, విపక్షాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం రసాభాసగానే ముగిసింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల ప్రతిష్టంభన నేపథ్యంలో స్పీకర్ సుమిత్రా మహాజన్ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఢిల్లీలో పార్లమెంటు సెంట్రల్ హాల్లో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ భేటీలో ఇరుపక్షాలు ఎవరి ధోరణిని వారు కొనసాగించడంతో ప్రతిష్టంభన కొనసాగుతోంది. మంత్రులు రాజీనామా చేయాలని విపక్షం, చేస ప్రసక్తే లేదని కేంద్రం ఎవరి పట్టు మీద వాళ్లున్నారు. దీంతో ఎలాంటి దిశా నిర్దేశం లేకుండానే సమావేశం ముగిసింది. కేంద్రమంత్రులు,   మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ రాజీనామాలపై విపక్షాలు పట్టుబట్టాయి. సుష్మ, రాజే, చౌహాన్ రాజీనామా చేయాల్సిందేనని, అప్పటి వరకు చర్చలు జరిగేది లేదని  విపక్షం గట్టిగా వాదించింది. విపక్షాలు డిమాండ్లను తోచ్చిపుచ్చిన కేంద్రం.. వాళ్లెవరూ రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది.   

మరోవైపు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ సమావేశానికి హాజరు కాలేదు.  దీంతో వివాదం ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు మరింత సన్నగిల్లాయి.  అయితే ప్రధాని సభలో సమాధానం చెబుతారని  ప్రభుత్వం ప్రకటించింది. దీనికి  విపక్షాలు  ససేమిరా అన్నాయి.

వ్యాపం, లలిత్ గేట్ వివాదాలతో గత వారం రోజులుగా పార్లమెంటు అట్టుడుకుతోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్,  రాజస్థాన్ సీఎం వసుంధరా రాజె రాజీనామా చేయాల్సిందే అంటూ పట్టుబడుతున్నాయి.  నినాదాలు, ప్లకార్డుల ప్రదర్శనతో హోరెత్తిస్తున్నాయి.  దీనిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ వివరణ ఇవ్వాలని కోరుతున్నాయి.

మరోవైపు  లలిత్ మోదీ వీసా విషయంలో బ్రిటిష్ గవర్నమెంటుకు తానెప్పుడూ సిఫారసు చేయలేదని సుష్మాస్వరాజ్ ఈ రోజు రాజ్యసభలో  ప్రకటించారు. దీంతో మరింత గందరగోళం చెలరేగింది. సుష్మా  ప్రకటనను రికార్డుల నుంచి తొలగించాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ డిమాండ్ చేశారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా సభలో మంత్రి ప్రకటన చేయడాన్ని ఆమె తప్పుబట్టారు. దీంతో అటు రాజ్యసభ, ఇటు లోక్సభ మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. అఖిలపక్షం ముగిసిన తర్వాత పార్లమెంటు ఉభయ సభలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఇరు సభల్లోనూ విపక్ష సభ్యుల నిరసనల హోరు కొనసాగుతోంది.

మరిన్ని వార్తలు