ప్రయాణీకులను ఇలా డీల్‌ చేస్తారా..

5 Jan, 2018 16:49 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఇండిగో ఎయిర్‌లైన్స్‌ ఇటీవల ఓ ప్రయాణీకుడిపై దౌర్జన్యం చేసిన ఘటనకు సంబంధించి పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ ఘాటుగా స్పందించింది. విమానయాన సంస్థల సిబ్బంది ప్రయాణీకులతో స్నేహపూర్వకంగా మెలగాలని, గౌరవంగా వ్యవహరించడం నేర్చుకోవాలని హితవు పలికింది. విమానయాన సిబ్బంది ప్రయాణీకులపై దౌర్జన్యపూరితంగా వ్యవహరించడం, దురుసుగా ప్రవర్తించడం వంటి ఘటనలు ఇటీవల తరచూ చోటుచేసుకుంటున్నాయని కమిటీ తన నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది.

ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది దురుసు ప్రవర్తన ఘటనలు కొన్ని మీడియాలో వస్తున్నా పలు సంఘటనలు వెలుగు చూడటం లేదని పేర్కొంది. ఇటీవల ఇండిగో సిబ్బంది ప్రయాణీకుడిపై దౌర్జన్యానికి పాల్పడిన తీరును తీవ్రంగా ఖండించింది.దురుసుగా ప్రవర్తించిన సిబ్బందిపై చర్యలు తీసుకున్నంత మాత్రాన విమానయాన సంస్థలు తమ తప్పిదాల నుంచి బయటపడలేవని 26 పేజీల నివేదికలో కమిటీ స్పష్టం చేసింది. ఎయిర్‌లైన్స్‌లో చోటుచేసుకుంటున్న ఘటనలు వ్యక్తిగతమైనవి కావని..ఇవి సంస్ధాగతమైనవని పేర్కొంది.

ఇండిగో వంటి సంస్థలు ప్రయాణీకులతో వ్యవహరించే పద్ధతిలో సానుకూల మార్పులు ప్రవేశపెట్టాల్సి ఉందని స్పష్టం చేసింది. తమ సిబ్బంది దురుసు ప్రవర్తనపై ఇండిగో కన్నేసి ఉంచాలని, వారి దుందుడుకు ప్రవర్తనను సరిచేయాలని సూచించింది. పలు విమానయాన సంస్థల సీఈఓలతో, సిబ్బంది, ప్రయాణీకులతో కమిటీ విస్తృతంగా చర్చలు జరిపిన మీదట ఈ నివేదికను రూపొందించింది. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా