ట్విటర్‌కు పది రోజులు గడువు

25 Feb, 2019 16:45 IST|Sakshi

వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇనస్ట్రాగ్రామ్‌కు సమన్లు  

మార్చి 6న  పార్లమెంటరీ కమిటీ ముందు హాజరు కావాలి

10రోజుల్లో రాత పూర్వకంగా ట్విటర్‌  స్పందించాలి


సాక్షి, న్యూఢిల్లీ :  ప్రముఖ సోషల్‌ మీడియా సంస్థలకు  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై నియమించిన  పార్ల‌మెంట‌రీ  క‌మిటీ సమన్లు జారీ చేసింది.  సోమవారం (ఫిబ్రవరి 25)న ట్విట్‌ర్‌ అధికారులతో చర్చించిన కమిటీ రాబోయే పార్లమెంటు ఎన్నికలు విదేశీ సంస్థల చేత ప్రభావితం కావు అనే హామీ ఇవ్వాలని, ఇదే అంశంపై భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ)తో మరింత సన్నిహితంగా చర్చలు జరపాలని కమిటీ చైర్మన్‌, ఎంపీ అనురాగ్‌ ఠాకూర్‌ కోరారు.  ఈ అంశాలపై  రాత పూర్వకంగా స్పందించేందుకు ట్విటర్‌ సీఈవో జాక్‌ డోర్సేతోపాటు ఇతర సీనియ‌ర్ అధికారుల‌కు 10రోజులు గడువును ఇచ్చారు. అవసరమైతే ఇదే విషయంపై మరోసారి సమన్లు జారీ చేసే అవకాశం ఉందని కూడా ఆయన సూచించారు.
 
సోషల్ మీడియా వేదికలపై 'పౌరుల హక్కులను పరిరక్షించడం' అనే అంశంపై వారి అభిప్రాయాలను  తెలిపేందుకు  వాట్సాప్‌తోపాటు  ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లక ప్రతినిధులకు కూడా సమన్లు జారీ చేసింది. మార్చి 6వ తేదీన ఆయా సంస్థ‌ల‌కు చెందిన సీనియ‌ర్లు క‌మిటీ ముందు హాజ‌రుకావాల‌ని కోరారు. రాబోయే లోక్‌ సభఎన్నిక‌ల్లో సోష‌ల్ మీడియా సంస్థ‌లు ఎటువంటి ప్ర‌భావాలు చూపించ‌కుండా ఉండేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అనురాగ్ ఠాకూర్ కోరారు. సోష‌ల్ మీడియా సంస్థ‌లు.. ఎన్నిక‌ల స‌మ‌స్య‌ల‌పై ఎన్నికల సంఘంతో క‌లిసి ప‌నిచేయాల‌న్నారు. అంతకుముందు ట్విటర్ వైస్‌ ప్రెసిడెంట్‌,పబ్లిక్‌ పాలసీ హెడ్‌ కోలిన్‌ క్రోవెల్‌తో కమిటీ దాదాపు మూడున్నర గంటలపాటు చర్చించింది.  ఈ సమావేశంలో సీఈవో జాక్ డోర్సీ రాసిన లేఖ‌ను అనురాగ్ ఠాకూర్ చ‌దివి వినిపించినట్టు తెలుస్తోంది. 

కాగా సోష‌ల్ మీడియాలో పౌరుల హక్కుల పరిరక్షణ కోసం బీజేపీ ఎంపీ అనురాగ్‌ ఠాకూర్‌ నేతృత్వంలో పార్ల‌మెంట‌రీ ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. ఈ నెల ఒక‌ట‌వ తేదీన ట్విటర్ సంస్థ‌కు ప్ర‌భుత్వం స‌మ‌న్లు కూడా జారీ చేసింది. సమయం తక్కువగా ఉందంటూ ట్విటర్‌  అధికారులు నిరాకరించడంతో​, సమావేశం వాయిదా పడుతూ వచ్చింది.  వాస్తవానికి ఈ  మీటింగ్‌ తొలుత ఫిబ్రవరి7నుంచి 11వ తేదీకి వాయిదా పడింది. అనంతరం ట్విటర్‌ అధికారులు గైర్హాజరుకావడంతో పార్లమెంటరీ కమిటీ 15రోజుల్లో కమిటీ హాజరు కావాలంటూ అల్టిమేటం జారీ చేసిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు