ఈసీతో టచ్‌లో ఉండండి

26 Feb, 2019 03:29 IST|Sakshi

ట్విట్టర్‌కు సూచించిన పార్లమెంటరీ కమిటీ

ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లకు నోటీసులు

న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ)తో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ, అవసరమైనప్పుడు వెంటనే స్పందించాలని మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ ట్విట్టర్‌ను పార్లమెంటరీ కమిటీ కోరింది. త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో జోక్యాన్ని నివారించేందుకు తీసుకుంటున్న చర్యలను తమకు వివరించాలంటూ సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లకు నోటీసులు జారీ చేసింది. రాబోయే ఎన్నికలను ప్రభావితం చేసేందుకు సోషల్‌ మీడియాను దుర్వినియోగం చేసుకునే అవకాశం ఉందంటూ ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో చోటుచేసుకున్న ఈ పరిణామం ప్రాముఖ్యతను సంతరించుకుంది. భారత్‌లో త్వరలో జరిగే ఎన్నికల్లో అంతర్జాతీయంగా ఎటువంటి జోక్యం ఉండకుండా చూసుకుంటామని ట్విట్టర్‌ ప్రతినిధులు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. కమిటీ సంధించిన పలు ప్రశ్నలకు పది రోజుల్లో రాత పూర్వకంగా సమాధానం అందజేసేందుకు  అంగీకరించారు.

సానుకూలంగా స్పందించిన ఫేస్‌బుక్‌
ఫేస్‌బుక్‌తోపాటు అనుబంధ సంస్థలైన వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్‌ల తరఫున ఫేస్‌బుక్‌ గ్లోబల్‌ పబ్లిక్‌ పాలసీ వైస్‌ ప్రెసిడెంట్‌ జోయెల్‌ కప్లాన్‌ హాజరుకానున్నట్లు సమాచారం. ఈయనతోపాటు ఫేస్‌బుక్‌ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ అజిత్‌ మోహన్‌ హాజరవుతారని భావిస్తున్నారు. పార్లమెంటరీ కమిటీ ఎదుట మార్చి 6వ తేదీన వీరు హాజరుకానున్నారు.  వినియోగదారుల ప్రయోజనాలు, హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని ఫేస్‌బుక్‌ ఒక ప్రకటనలో పేర్కొంది.

మరిన్ని వార్తలు