నవంబర్ 16 నుంచి పార్లమెంట్

14 Oct, 2016 03:27 IST|Sakshi
నవంబర్ 16 నుంచి పార్లమెంట్

సీజీఎస్‌టీ, ఐజీఎస్‌టీ బిల్లుల ఆమోదం కోసం కేంద్ర కేబినెట్ నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాల షెడ్యూలు సంప్రదాయానికి భిన్నంగా ఒకింత ముందుకు జరిగింది. సాధారణంగా నవంబర్ చివరి వారంలో ప్రారంభమై క్రిస్మస్ పర్వదినానికి ఒకటి రెండు రోజుల ముందు పూర్తయ్యే ఈ శీతాకాల సమావేశాలను ఈ ఏడాది నవంబర్ 16వ తేదీనే ప్రారంభించాలని పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీపీఏ) గురువారం నిర్ణయించింది.

నవంబర్ 16న మొదలై డిసెంబర్ 16వ తేదీ వరకు శీతాకాల సమావేశాలు కొనసాగనున్నాయి. వస్తువులు, సేవల పన్ను (జీఎస్‌టీ)కు సంబంధించి మిగిలి ఉన్న సెంట్రల్ జీఎస్‌టీ (సీజీఎస్‌టీ), ఇంటిగ్రేటెడ్ జీఎస్‌టీ (ఐజీఎస్‌టీ) చట్టాలను పూర్తిచేయాలన్న సంకల్పంతో కేంద్రం శీతాకాల సమావేశాల షెడ్యూలును ముందుకు జరిపింది. జీఎస్టీ అమలుకు వీలుగా 122వ రాజ్యాంగ సవరణ పూర్తయినప్పటికీ సీజీఎస్‌టీ, ఐజీఎస్‌టీ బిల్లులు ఆమోదం పొందాల్సి ఉంది. ఈ శీతాకాల సమావేశాల్లో పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో సర్జికల్ దాడి అంశం ప్రధానంగా మారే అవకాశముంది.

మరిన్ని వార్తలు