'నా మానసిక ఆరోగ్యం బాగోలేదు'

24 Feb, 2016 12:09 IST|Sakshi
'నా మానసిక ఆరోగ్యం బాగోలేదు'

వివాదాస్పద న్యాయమూర్తి కర్నన్ మరోసారి తెరపైకి వచ్చారు. భారత ప్రధాన న్యాయమూర్తికి ఓ లేఖ ద్వారా వివరణ ఇచ్చారు.  తన మానసిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదని.. ఆ నేపథ్యంలోనే తప్పుడు ఆర్డర్ పంపానని భారత ప్రధాన న్యాయమూర్తితో పాటు జస్టిస్ జె.ఎస్ కెహర్, జస్టిస్ ఆర్.భానుమతికి తెలియజేశారు. కొందరు సహచర న్యాయమూర్తులు ఎగతాళి చేయడంతో మానసికంగా కుంగిపోయానని మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిఎస్ కర్నన్ తెలిపారు. అయితే ఆ న్యాయమూర్తులు ఎవరన్న వివరాలను మాత్రం చెప్పలేదు.

భవిష్యత్తులో తన వైఖరి సక్రమంగా ఉండేలా చూసుకుంటానని, అటువంటి తప్పులు తిరిగి జరగకుండా చూసుకుంటానని జస్టిస్ కర్నన్ తన లేఖలో హామీ ఇచ్చారు. తాను షెడ్యూల్డు కులాలకు చెందిన వ్యక్తి కావడంతో ఇతర న్యాయమూర్తుల వేధింపులకు గురౌతున్నానని, కొన్ని సందర్భాల్లో తనను ఎగతాళి చేస్తున్నారని గతంలో ఆ విషయాన్నిసిజిఎఫ్ జాతీయ కమిషన్ ఛైర్మన్‌కు కూడా ఫిర్యాదు చేసినట్లు తాజా లేఖలో తెలిపారు. తనను వేధించిన జడ్జిల పేర్లను వెల్లడించలేదని, న్యాయవ్యవస్థలో కులతత్వాన్ని నిర్మూలించాలని, మత సామరస్యాన్ని కాపాడటంలో న్యాయవ్యవస్థ ముందుండాలని ఆయన కోరుకుంటున్నట్లు తెలిపారు.

భారత ప్రధాన న్యాయమూర్తి టి.ఎస్. ఠాకూర్.. గతంలో జస్టిస్ కర్నన్ ను కోల్‌కతా హైకోర్టుకు బదిలీచేసిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో ఆ ఉత్తర్వులపై ఏకపక్షంగా స్పందిస్తూ తనకు తానే సుమోటోగా చర్యలు తీసుకుంటూ నిర్ణయం ప్రకటించుకున్న కర్నన్.. తనను బదిలీ చేయడానికి గల కారణాలను భారత ప్రధాన న్యాయమూర్తి ఫిబ్రవరి 15లోగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. అయితే మద్రాస్ హైకోర్ట్  విజ్ఞప్తి మేరకు ఫిబ్రవరి 12న కర్నన్ జారీచేసిన అన్ని ఉత్తర్వులపైనా జస్టిస్ కెహర్ నేతృత్వంలోని బెంచ్ స్టే విధించింది. తిరిగి  నోటీసులు అందేవరకూ కర్నన్ కు ఎటువంటి జ్యుడీషియల్ వర్క్ అప్పగించరాదని సుప్రీం కోర్టు న్యాయమూర్తి మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఆదేశాలిచ్చారు. తర్వాత ఓసారి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఠాకూర్ ను జస్టిస్ కర్నన్ వ్యక్తిగతంగా కలిశారు. తాజాగా తన ప్రవర్తనకు గల కారణాలను వివరిస్తూ భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు.

మరిన్ని వార్తలు