ఆగిన రైళ్లు

18 Oct, 2014 01:56 IST|Sakshi

* ఆలస్యంపై ఆగ్రహం
* ప్రయాణికుల రాస్తారోకో
*  రెండు గంటలు సేవల ఆటంకం

సాక్షి, చెన్నై: రైల్వే యంత్రాంగంపై ప్రయాణికులు శుక్రవారం కన్నెర్ర చేశారు. ఎలక్ట్రిక్ రైలు ఆలస్యంగా నడుస్తుండడంపై తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. రైల్ రోకోకు దిగడంతో రెండు గంటలు రైలు సేవలకు తీవ్ర ఆటంకం ఎదురైంది.  సెంట్రల్ నుంచి తిరువళ్లూరు, గుమ్మిడిపూండి మార్గంలో నిత్యం రైళ్లు పరుగులు తీస్తుంటాయి. గుమ్మిడి పూండి మార్గంలో నడిచే ఎలక్ట్రిక్ రైళ్లకు సిగ్నల్ లభించడంలో ఇబ్బందులు తప్పవు. ప్రధానంగా బేషిన్ బ్రిడ్జి దాటాలంటే సమయం అంతా వృథాకాక తప్పదు. ఈ పరిస్థితుల్లో పొన్నేరి నుంచి సెంట్రల్‌కు ఉదయం ఎలక్ట్రిక్ రైలు బయలుదేరింది.

ఈ రైలు నిర్ణీత సమయం 8.40 గంటలకు సెంట్రల్ చేరుకోవాల్సి ఉంది. ఈ రైలు నత్తనడకన సాగుతుండడంతో, అన్ని స్టేషన్లలో నిర్ణీత సమయం కంటే, ఎక్కువ సమయం ఆగుతూ రావడం ప్రయాణికుల్లో తీవ్ర అసహనాన్ని రేపింది. బే షిన్ బ్రిడ్జి వద్ద ఈ రైలుకు సిగ్నల్ లభించ లేదు. దీంతో గంట పాటుగా రైల్లోనే కూర్చోవాల్సి వచ్చింది. కూతవేటు దూరానికి గంట సేపు వేచి ఉండాల్సి రావడంతో ప్రయాణికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
 
రైల్‌రోకోతో సేవల ఆటంకం : తీవ్ర ఆగ్రహానికి లోనైన ప్రయాణికులు మరో ట్రాక్ మీదకు చేరుకున్నారు. అటు వైపుగా వచ్చే రైళ్లను అడ్డుకుంటూ రైల్ రోకోకు దిగారు. దీంతో తిరువళ్లూరు మార్గంలో వెళ్లాల్సిన రైళ్ల సేవలకు ఆటంకం ఏర్పడింది. అటు తిరువళ్లూరు, ఇటు గుమ్మిడిపూండి మార్గంలో రైలు సేవలు దాదాపుగా ఆగాయి. ఎక్కడి రైళ్లు అక్కడే నిలిపి వేయాల్సి వచ్చింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, ఉన్నతాధికారులు ఉరుకులు పరుగులతో అక్కడికి చేరుకున్నారు. కొందరు ప్రయాణికులు అయితే, తమ సమయం వృథా అవుతుండడంతో ట్రాక్ వెంబడి నడుచుకుంటూ పరుగున సెంట్రల్‌కు చేరుకున్నారు.

మరికొందరు ప్రయాణికులు సమీపంలోని రోడ్డు మీదకు చేరుకుని ఆటోల్ని ఆశ్రయించి తమ గమ్యస్థానాలకు పరుగులు తీశారు.
 బుజ్జగింపు : బేషిన్ బ్రిడ్జి రైల్వే స్టేషన్‌కు చేరుకున్న పోలీసులు, అధికారులు ప్రయాణికుల్ని బుజ్జగించే యత్నం చేశారు. అప్పటికే తీవ్ర ఆగ్రహంతో ఉన్న కొందరు ప్రయాణికులు వారిపై తిరగబడే యత్నం చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎక్కడిక్కడ రైళ్లు ఆగడంతో ఆయా స్టేషన్లలో ప్రయాణికులు గంటకు పైగా వేచి ఉండాల్సి వచ్చింది. చివరకు ప్రయాణికుల్ని బుజ్జగించేందుకు రైల్వే అధికారులు నానా తంటాలు పడ్డారు.

ప్రతి రోజూ ఈ రైలు ఆలస్యంగా నడుస్తుండడం వల్లే తాము కార్యాలయాలకు ఆల స్యంగా వెళ్లాల్సి వస్తున్నదంటూ కొందరు ఉద్యోగులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎట్టకేలకు ఆ రైలును త్వరితగతిన సెంట్రల్‌కు పం పించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇక మీదట పొన్నేరి - సెంట్రల్ మధ్య ఉదయం 7.15 గంటలకు బయలుదేరే ఈ రైలు ఆలస్యం కాకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వడంతో ప్రయాణికులు శాంతించారు. ఈ తతంగం పూర్తి అయ్యేందుకు రెండు గంటలు పట్టడంతో ఇతర మార్గాల్లోని రైళ్లు ఆలస్యంగా నడవాల్సి వచ్చింది.

మరిన్ని వార్తలు