6 నెలల్లో.. 1.23 కోట్ల మంది

23 Oct, 2017 09:47 IST|Sakshi

బెంగళూరు అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు నుంచి రాకపోకలు 

రెండవ టెర్మినల్‌ నిర్మాణంపై దృష్టి 

రోజుకు 68 వేల మంది పైమాటే.. ఇది బెంగళూరు ఎయిర్‌పోర్టు నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య. దక్షిణాదిలోనే ముఖ్యమైన ఈ ఎయిర్‌పోర్టు ఇప్పుడు కిటకిటలాడిపోతోంది. ప్రతి నెలా ప్రయాణికుల సంఖ్య పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. దీంతో విమానాశ్రయ విస్తరణ ఆవశ్యకంగా మారింది. 

సాక్షి, బెంగళూరు: దేశంలోనే అతిపెద్ద ఎయిర్‌పోర్టులో మూడవదిగా పేరు గాంచిన బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సరుకు రవాణాలోనూ జోరు చూపుతోంది. 2017 ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు సుమారు 1.23 కోట్ల మందికిపైగా కెంపేగౌడ విమానాశ్రయం నుంచి దేశవిదేశాలకు రాకపోకలు సాగించారు. గత ఏడాది ఇదే సమయానికి ఈ  విమానా శ్ర యం నుంచి 1.14 కోట్ల మంది ప్రయాణించారు. దీంతో పాటు 1.73 లక్షల మెట్రిక్‌ టన్నుల సరుకు రవాణా చేయడం ద్వారా మిగతా అంతర్జాతీయ విమానాశ్రయాలకు ధీటుగా నిలిచింది. గత ఏడాది నవంబర్‌ నెలలో నోట్ల రద్దు అనంతరం ఏర్పడ్డ క్లిష్ట పరిస్థితుల్లో కూ డా విమానాశ్రయం వృద్ధి రేటును నమోదు చేయగలిగింది. మొత్తం 32 విమానయాన సంస్థలు దేశ విదేశాల్లోని 60 ప్రముఖ నగరాలకు కెంపేగౌడ విమానాశ్రయం నుంచి సర్వీసుల్ని నడుపుతున్నాయి. 

రెండవ టెర్మినల్‌కు సన్నాహాలు 
ప్రయాణికుల రద్దీ పెరుగుతూనే ఉండడంతో కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్త రన్‌వేతో పాటు రెండవ టెర్మినల్‌ నిర్మాణానికి ఎయిర్‌పోర్ట్‌ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఎయిర్‌పోర్ట్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో పక్షులపై అధ్యయనం చేయడానికి నిర్ణయించుకున్న విమానాశ్రయం అధ్యయనం నిర్వహించడానికి టెండర్లను ఆహ్వానించింది. విమాన రాకపోకల సమయంలో పక్షులు ఢీకొట్టడంతో భారీ ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉండడంతోనే విమానాశ్రయం అధికారులు ఎయిర్‌పోర్ట్‌లో కొత్తగా నిర్మిస్తున్న రన్‌వే, రెండవ టెర్మినల్‌ నిర్మాణాల్లో పక్షుల సమస్యపై అధ్యయనం చేయిస్తున్నారు. దీంతో పాటు ఎయిర్‌పోర్ట్‌ చుట్టుపక్కనున్న గ్రామాల్లో అశాస్త్రీయ పద్ధతుల్లో చెత్తను పారేస్తుండడంపై స్థానిక పంచాయితీ, పాలికె అధికారులు,ప్రజలతో చర్చించి పరిష్కారం కనుగొనాలని నిర్ణయించారు.   
 

మరిన్ని వార్తలు