వేరే స్టేషన్‌ చేరిన రైలు.. ప్యాసింజర్స్‌ షాక్‌!

27 Mar, 2018 20:57 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఇంత వరకు రైలు ప్రమాదాల గురించి, రైలు ఆలస్యం, రద్దు వంటి విషయాల గురించి విని ఉంటారు. కానీ ఒక స్టేషన్ వెళ్లాల్సిన రైలు.. మరో స్టేషన్‌కు చేరడం ఎప్పుడైనా విన్నారా? ఈ అరుదైన సంఘటన మన దేశ రాజధానిలోనే జరిగింది. రైల్వే లాగ్‌ ఆపరేటర్‌ తప్పిదం వల్ల మంగళవారం ఉదయం ఓల్డ్‌ ఢిల్లీలో ఈ సంఘటన చోటుచేసుకుంది. దీంతో బిత్తరపోవడం ప్రయాణికుల వంతైంది. 

న్యూఢిల్లీకి చేరాల్సిన రైలు ఏకంగా స్టేషన్‌ మారి..  ఓల్డ్‌ ఢిల్లీకి చేరింది. ప్రమాదం ఏమి జరగకపోవడం.. చివరకు ఏదొక స్టేషన్‌కు చేర్చడంతో ప్రయాణికులు ఒకరకంగా ఊపిరిపిల్చుకున్నారు. ఈ తప్పిదానికి కారణమైన లాగ్‌ ఆపరేటర్‌ను రైల్వే అధికారులు విధుల నుంచి సస్పెండ్‌ చేశారు. రైలు నంబర్ల విషయంలో తికమక పడ్డ లాగ్‌ ఆపరేటర్ న్యూఢిల్లీ వెళ్లాల్సిన పానిపట్‌ రైలును ఏకంగా ఓల్డ్‌ ఢిల్లీ స్టేషన్‌ వైపు మళ్లించాడు. ఢిల్లీలోని సర్దార్‌ బజార్‌ రైల్వే స్టేషన్‌కు రెండు ప్యాసింజర్‌ రైల్లు 7.38 నిమిషాలకు చేరుకున్నాయని, దాంతో తికమక పడ్డ లాగ్‌ ఆపరేటర్‌ న్యూఢిల్లీ చేరాల్సిన పానిపట్‌ రైలును ఓల్డ్‌ ఢిల్లీ స్టేషన్‌కు మళ్లించాడని రైల్వే అధికారులు తెలిపారు. తప్పును గ్రహించిన అధికారులు దాన్నివెంటనే న్యూఢిల్లీ స్టేషన్‌కు పంపడంతో ఆలస్యంగా గమ్యానికి చేరుకున్న ప్రయాణికులు రైల్వే తీరుపై అసహనం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు