పంచవటి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికుల విధ్వంసం

18 Sep, 2018 11:23 IST|Sakshi

ముంబై : తేజాస్‌ ఎక్స్‌ప్రెస్‌ విధ్వంసం గుర్తుండే ఉంటుంది. ఆకతాయిలైన ప్రయాణికులు, సీట్లకు ముందున్న ఎల్‌సీడీ స్క్రీన్లను ధ్వంసం చేయగా.. మరికొందరు హెడ్‌ఫోన్లను ఎత్తుకెళ్లారు. వ్యాక్యూమ్‌ టాయిలెట్‌ను కంపు కంపు చేశారు. ఈ సంఘటన ఇంకా మర్చిపోనే లేదు. అప్పుడే ముంబై-నాసిక్‌ పంచవటి ఎక్స్‌ప్రెస్‌లోనూ ఇదే రకమైన విధ్వంసకర వాతావరణం చోటు చేసుకుంది. ఈ రైలు సర్వీసును అప్‌గ్రేడ్‌ చేసిన నాలుగు నెలల్లోనే, ట్రే టేబుల్స్‌ను, కర్టెన్లను చెల్లాచెదురు చేశారు. అంతేకాక కిటికీలను పగులగొట్టారు. హెల్త్‌కు చెందిన రెగ్యులేటర్లను, కుళాయిలను, లగేజ్‌ ర్యాక్‌ల గ్లాస్‌లను ప్రయాణికులు బ్రేక్‌ చేశారు. చెత్తాడబ్బాలను, అద్దాలను ఎత్తుకుపోయారు. రైళ్లలో తరుచూ జరుగుతున్న ఈ సంఘటనలతో, సెంట్రల్‌ రైల్వే ఇప్పటికీ రిఫైర్‌ బిల్లుగా రూ.9 లక్షల మేర ఖర్చు చేసింది. 

ప్రయాణికులు వారికి అందిస్తున్న సౌకర్యాలను సరిగ్గా వినియోగించుకోవడం లేదని రైల్వే అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై ఫిబ్రవరి 7న రైల్వే మంత్రిత్వశాఖ అన్ని జోనల్‌ రైల్వేస్‌కు ఒక లేఖ రాసింది. ఈ విషయాన్ని రైల్వే బోర్డు విచారణ జరుపుతుందని తెలిపింది. గంటకు 200 కిలోమీటర్ల స్పీడుతో, తేజాస్‌ ఎక్స్‌ప్రెస్‌ లాంచ్‌ అయిన సంగతి తెలిసిందే. సెమీ-లగ్జీర ట్రైన్‌ అయిన దీన్ని గోవా నుంచి ప్రారంభించారు. గోవా నుంచి ఇది ముంబైకు ఒక ట్రిప్‌ వేసింది. ఇక అంతే తిరుగు ప్రయాణంలో ప్రయాణికులు ఈ రైలు విండోలను పగలగొట్టారు. హెడ్‌ఫోన్లను దొంగలించారు. 

ఈ సంఘటనలతో రైళ్లలో అందిస్తున్న సౌకర్యవంతమైన సర్వీసులను తీసివేయాలని రైల్వే శాఖ భావించింది. అయితే రోజూ ట్రాక్‌లపై చాలామంది ప్రాణాలు తీసుకుంటున్నారని, అలాగని ముంబై సబ్‌అర్బన్‌ సర్వీసులను రైల్వే ఆపివేస్తుందా అని రైల్‌ యాత్రి పరిషద్‌ అధ్యక్షుడు సుభాష్‌ గుప్తా ప్రశ్నించారు. అలాగే పగిలిపోయిన ఎల్‌సీడీ స్క్రీన్లను మొత్తంగా తీసివేయడం కంటే, వాటిని బాగు చేయడం మంచిదని పేర్కొన్నారు. ఒకవేళ ఆ సౌకర్యాలను తీసివేస్తే, టిక్కెట్‌ ఛార్జీలను కూడా తగ్గించాలని ప్రయాణికుల అసోసియేషన్‌ డిమాండ్‌ చేస్తోంది.

మరిన్ని వార్తలు