‘ఓటమి నైరాశ్యంతోనే ఈవీఎంలపై వివాదం’

22 May, 2019 19:49 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఓటమి తప్పదనే నిరాశతోనే విపక్షాలు వీవీప్యాట్‌లపై రాద్ధాంతం చేస్తున్నాయని కేంద్ర మంత్రి, ఎల్జేపీ చీఫ్‌ రాం విలాస్‌ పాశ్వాన్‌ అన్నారు. ఈవీఎంలపై విపక్షాలు గగ్గోలు పెట్టడం వారి ఓటమికి సంకేతమని ఎద్దేవా చేశారు. ఓటమికి చేరువైనప్పుడు విపక్షాలు ఈవీఎంలపై ఫిర్యాదు చేస్తాయని తాను గతంలోనే చెప్పానని గుర్తుచేశారు.

ఈవీఎంలను వ్యతిరేకిస్తున్న వారు ఎన్నికలను అర్ధ, అంగబలం శాసించే పాత రోజులకు దేశాన్నితీసుకువెళుతున్నారని ఆరోపించారు. సుప్రీం కోర్టు ఇప్పటికే ఈవీఎం, వీవీప్యాటర్లపై విస్పష్ట ఉత్తర్వులు ఇచ్చినా ఓటమి భయంతో విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని పాశ్వాన్‌ మండిపడ్డారు. విపక్షాలు గెలిస్తే ఈవీఎంలు సరిగా పనిచేసినట్టు, ఓడిపోతే మాత్రం ఈవీఎంలను తారుమారు చేసినట్టు గగ్గోలు పెట్టే వైఖరి రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య ప్రక్రియకు చేటు అని వ్యాఖ్యానించారు.

కాగా ఎన్డీయే మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే తన కుమారుడు చిరాగ్‌ పాశ్వాన్‌ కేంద్ర మంత్రిగా ముందుకొస్తారని ఆయన సంకేతాలు పంపారు. చిరాగ్‌ పాశ్వాన్‌కు కేంద్ర మంత్రి కాగల సామర్ధ్యాలు ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.

మరిన్ని వార్తలు