మాట మార్చిన ‘పతంజలి’.. అది కోవిడ్‌ మందు కాదు!

30 Jun, 2020 15:18 IST|Sakshi

ఉత్తరఖాండ్‌ డ్రగ్‌ డిపార్ట్‌మెంటు నోటీసులకు బదులిచ్చిన పతంజలి కంపెనీ

డెహ్రాడూన్‌: మహమ్మారి కరోనాకు మందు కనుగొన్నామంటూ సంచలన ప్రకటన చేసిన ఆయుర్వేద కంపెనీ పతంజలి నిర్వాహకులు తాజాగా యూటర్న్‌ తీసుకున్నారు. తాము కరోనా నివారణకు ఎలాంటి మెడిసిన్‌ తయారు చేయలేదంటూ మాట మార్చారు. ‘కరోనా కిట్‌’ పేరిట ఎలాంటి అమ్మకాలు చేపట్టలేదని మంగళవారం వివరణ ఇచ్చారు. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న ప్రాణాంతక కోవిడ్‌-19ను కట్టడి చేసేందుకు కరోలిన్‌ అనే మందును కనిపెట్టినట్లు పతంజలి కంపెనీ గత మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. యోగా గురువు రాందేవ్‌ బాబా పతంజలి ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్(పతంజలి‍ ప్రధాన కేంద్రం)‌లో పత్రికా సమావేశం ఏర్పాటు చేసి మరీ ఈ విషయాన్ని వెల్లడించారు. అంతేగాక కరోనా లక్షణాలు కలిగి ఉన్న వంద మంది రోగులపై ఈ మందును ప్రయోగించగా, వారిలో దాదాపు 65 మంది పూర్తిగా కోలుకున్నారని పతంజలి కంపెనీ పేర్కొంది.(పతంజలి ‘కరోలిన్‌’పై పెను దుమారం)

ఈ క్రమంలో పతంజలి తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ నిబంధనలు తొంగలో తొక్కి ప్రజల ప్రాణాలతో ఆడుకున్నారంటూ రాందేవ్‌ బాబా, పతంజలి చైర్మన్‌ బాలకృష్ణపై పలువురు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కరోనిల్‌ ప్రకటనలను భారత ఆయుష్‌ మంత్రిత్వ శాఖ నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక ఈ విషయంపై స్పందించిన ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం.. కరోనా నిరోధక మందుల తయారీకి పతంజలి కంపెనీ ఎలాంటి లైసెన్స్‌లు తీసుకోలేదని, దగ్గు నివారణ మందనుకొనే తాము కరోలిన్‌ మందుకు అనుమతించామని పేర్కొంది. ఈ క్రమంలో కరోలిన్‌ మందుపై వివరణ ఇవ్వాల్సిందిగా.. ఉత్తరాఖండ్‌ డ్రగ్‌ డిపార్ట్‌మెంట్‌ పతంజలి సంస్థకు నోటీసులు జారీచేసింది.(మార్కెట్‌లోకి కరోనా ఔషధం..!)

ఈ విషయంపై మంగళవారం స్పందించిన కంపెనీ.. ‘‘‘కరోనా కిట్‌’ పేరును ఎక్కడా వాడటం లేదు. మందును తయారు చేయలేదు. దివ్య స్వసారి వతి, దివ్య కరోనిల్‌ టాబ్లెట్‌, దివ్య అను టేల్‌ అనే మెడిసిన్‌తో కూడిన ప్యాకేజీ మాత్రమే షిప్పింగ్‌ చేస్తున్నాం. కరోనిల్‌ కిట్‌ అనే కిట్‌ను విక్రయించడం లేదు. అంతేకాదు.. అది కరోనా చికిత్సకు ఉపయోగపడుతుందని కూడా ఎలాంటి పబ్లిసిటీ చేయలేదు. కేవలం ఈ మందులకు సంబంధించిన ప్రయోగం విజయవంతమైన విషయాన్ని మాత్రమే మీడియా ముందు తెలిపాం. కేవలం ఈ ఔషధం చేకూర్చే ప్రయోజనాల గురించి మాత్రమే వెల్లడించాం. మనుషులపై ప్రయోగించినపుడు సత్ఫలితాలు ఇచ్చిందనే చెప్పామే తప్ప.. ఇది కరోనాను నయం చేస్తుందని ఎక్కడా ఎప్పుడూ చెప్పలేదు’’ అని పేర్కొంది. అయితే అది దగ్గు మందా లేదా మరే ఇతర ఔషధమా అన్న క్లారిటీ మాత్రం ఇవ్వలేదు.

>
మరిన్ని వార్తలు