మీ కప్పు టీ వల్ల.. ఏడుగురు అమరులయ్యారు!

5 Jan, 2016 13:00 IST|Sakshi
మీ కప్పు టీ వల్ల.. ఏడుగురు అమరులయ్యారు!

ముంబై: పఠాన్కోట్ ఎయిర్బేస్ పై ఉగ్రవాద దాడి నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీపై శివసేన తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. పాకిస్థాన్ను నమ్మవద్దని తాము గతంలోనే ప్రధాని మోదీని హెచ్చరించామని గుర్తుచేసింది. ఇప్పటికైనా మోదీ ప్రపంచాన్ని ఏకం చేసే పనిని మాని.. భారత్పై దృష్టి పెట్టాలని ఘాటుగా సూచించింది.

మన సరిహద్దులు సురక్షితంగా లేవని తాజా ఉగ్రవాద దాడి స్పష్టం చేస్తున్నదని, దేశ అంతర్గత భద్రత ప్రమాదంలో  ఉన్నా సోషల్ మీడియాలో అమరులకు నివాళులర్పించడం మినహా జాతీయ స్థాయిలో ఎలాంటి పని జరుగడం లేదంటూ శివసేన తన అధికార పత్రిక 'సామ్నా'లో తీవ్రపదజాలంతో ధ్వజమెత్తింది. ' నవాజ్ షరీఫ్తో కప్పు చాయ్ పంచుకున్నందుకు ప్రతిఫలంగా ఏడుగురు జవాన్లు అమరులయ్యారు. మన సరిహద్దులు సురక్షితంగా లేవని, మన అంతర్గత భద్రత విధ్వంసపూరితంగా ఉందని తాజా ఘటన రుజువు చేస్తోంది. ఆరుగురు ఉగ్రవాదులతో భారత ఆత్మగౌరవాన్ని పాకిస్థాన్ తుత్తునియలు చేసింది' అని శివసేన మండిపడింది. గతవారం లాహోర్లో నవాజ్ షరీఫ్ ఇంటికి ప్రధాని మోదీ అతిథిగా వెళ్లినా.. పాకిస్థాన్ మరోసారి మనల్ని మోసం చేసిందని, పాకిస్థాన్ నిజంగా భారత్తో సత్సంబంధాలు కోరుకుంటే.. వెంటనే జెషే మహమ్మద్ అధినేత మౌలానా మసూద్ అజార్ను భారత్కు అప్పగించాలని డిమాండ్ చేసింది.

మరిన్ని వార్తలు