ఎమర్జెన్సీ.. ఐసీయూలో చేపలు

31 Jul, 2018 09:00 IST|Sakshi

పట్నా : ఐసీయూ (ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌)లో తీవ్ర అస్వస్థతకు గురైన రోగులను ఉంచుతారనే సంగతి తెలిసిందే. అయితే చేపలను ఐసీయూలో ఉంచడం ఎప్పుడైనా చూశారా.. కనీసం విన్నారా..? లేదా. అయితే బిహార్‌లోని పట్నా నలంద మెడికల్‌ కాలేజి ఆస్పత్రిలో ఆదివారం చేపలను ఐసీయూలో చేర్చారు. రాత్రంతా వాటిని ఐసీయూలోనే ఉంచి, మరునాడు ఉదయం పంపించారు.

ఇది చదవగానే మనుషులకే సరిగా దిక్కులేదు. చేపలను ఐసీయూలో ఉంచి చికిత్స చేశారంటే నిజంగా ఆ ఆస్పత్రి వైద్యులకు ఎంత నిబద్దతో అంటూ మురిసిపోకండి. ఎందుకంటే చేపలను ఐసీయూలో చేర్చింది వాటికి ఆరోగ్యం బాగాలేక కాదు. భారీ వర్షాలు, వరదల వల్ల చేపలు కాస్తా ఇలా ఆస్పత్రిలోకి చేరి, రోగులను పరామర్శించి వెళ్లాయి.

ఉత్తర భారత దేశంలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీ భారీ వర్షాల్లో తడిసి ముద్దవుతోంది. ప్రస్తుతం బిహార్‌లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. ఇదే క్రమంలో లోతట్టు ప్రాంతంలో ఉన్న నలంద ఆస్పత్రిలోకి వరద నీరు చేరింది. కేవలం జనరల్‌ వార్డులోకే కాక ఆఖరికి ఎమర్జెన్సీ వార్డు, ఐసీయూలోకి కూడా వరద నీరు చేరింది. అలా వచ్చిన వరద నీటిలో చిన్నచిన్న చేప పిల్లలు కూడా కొట్టుకొచ్చాయి.

ఈ వరదల పుణ్యాన ఆస్పత్రి మొత్తం ఒకేసారి శుభ్రపడిందని సిబ్బంది సంతోషపడుతుండగా.. రోగులు, వారి వెంట వచ్చిన వారు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది. ఇది ప్రతి ఏడాది ఉండే తంతేనని, అయినా అధికారులు పట్టించుకోవడం లేదని రోగులు వాపోతున్నారు.

మరిన్ని వార్తలు