'ఆ ఘటన కలచివేసింది.. నిజంగా దురదృష్టకరం'

29 May, 2020 17:00 IST|Sakshi

పట్నా : రెండు రోజుల క్రితం బిహార్‌లోని ముజఫర్‌నగర్‌ రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ఫామ్‌పై తల్లి మృతదేహాన్ని తట్టి లేపేందుకు ప్రయత్నించిన ఒక బాలుడి హృదయ విదారక వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. బీహార్‌కు చెందిన అర్బినా ఇన్ఫాత్‌ వ‌ల‌స కార్మికురాలు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఉపాధి కోసం వలస వెళ్లిన ఆమె తన కొడుకు రహమత్‌తో కలసి గుజ‌రాత్ నుంచి శ‌నివారం శ్రామిక్ రైలులో  తిరుగు ప‌య‌న‌మైంది. అయితే ఎండ వేడిమితో పాటు వందల కిలోమీటర్లు తిండీ, తిప్పలు లేకపోవడంతో అనారోగ్యానికి గురై రైలులోనే తుది శ్వాస విడిచారు. తాజాగా ఈ వీడియోను పరిగణలోకి తీసుకొని పట్నా హైకోర్టు సుమోటోగా స్వీకరించి గురువారం కేసుపై విచారణ జరిపింది. (హృ‌ద‌య విదార‌కం: చ‌నిపోయిన‌ త‌ల్లిని లేపుతూ..)

ఈ సందర్భంగా హైకోర్టు స్పందిస్తూ.. 'ఆ ఘటన ఇప్పటికి షాకింగ్‌గా ఉంది.. నిజంగా అలా జరగడం దురదృష్టకరం' అంటూ పేర్కొంది. ఈ సంఘటన తమను తీవ్రంగా కలచివేసిందని ఇకపై ఇలాంటివి జరగకుండా చూడాలంటూ హైకోర్టు రాష్ట్రాన్ని ఆదేశించింది. ఇందులో భాగంగా బీహార్‌ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది. 'చనిపోయిన మహిళ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారా? నిజంగానే అర్బీనా ఆకలితో చనిపొయిందా లేక ఇంకా ఏమైనా కారణముందా? చట్టం అమలు చేసే విధంగా ఏజెన్సీలు ఏం చర్య తీసుకుంటాయి? ఒకవేళ ఆ మహిళకు అంత్యక్రియలు నిర్వహించాల్సి వస్తే ప్రభుత్వ ఆదేశాల మేరకు సంప్రదాయ పద్దతిలో నిర్వహించారా? తల్లి చనిపోవడంతో అనాథగా మారిన ఆ బాలుడి సంరక్షణ ఎవరు చూస్తారు? ' అంటూ హైకోర్టు జడ్జీలు ప్రశ్నల వర్షం కురిపించారు.
('కేసీఆర్‌ను ప్రజలు రాళ్లతో కొట్టే రోజులు వస్తాయి')

దీనిపై ప్రభుత్వం తరపున రాష్ట్ర అడిషనల్‌ అడ్వొకేట్‌ జనరల్‌ ఎస్‌డీ యాదవ్‌ స్పందించారు. ఆయన మాట్లాడుతూ..' అర్బినా ఇన్ఫాత్‌ది సహజ మరణమే. సూరత్‌ నుంచి రైలులో ప్రయాణం చేస్తున్న సమయంలో సమయానికి తిండి లేక ఆమె ఆరోగ్య పరిస్థితి దెబ్బతినడంతోనే మృతి చెందింది. ఈ విషయాన్ని మృతురాలి చెల్లి, ఆమె భర్త స్వయంగా తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే అర్బీనా మృతదేహానికి పోస్టుమార్టమ్‌ నిర్వహించలేదు. అంతేగాక ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు కుటుంబసభ్యులకు అనుమతి కూడా ఇచ్చాము. మృతదేహాన్ని ముజఫర్‌ రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ఫామ్‌పై విడిచిపెట్టి వెళ్లడంపై అధికారుల వద్ద వివరాలను ఆరా తీశాము. అర్బీనా స్వస్థలం కతిహార్‌ అని, తన భర్తతో విడిపోయాక చెల్లి ఆమె భర్తతో కలిసి ఉంటుంది. అర్బినాకు మొదట కొడుకు ఒకడే అని పొరబడ్డాం. తరువాత అర్బినాకు ఇద్దరు కొడుకులని రహమాన్‌కు అన్న ఉన్నాడని, అతని పేరు ఫర్మాణ్‌ అని తెలిసింది. ప్రస్తుతం వారిద్దరిని తామే సంరక్షిస్తామని అర్బినా చెల్లి, ఆమె భర్త పేర్కొన్నారు. అంతేగాక ఈ కేసును మేము ప్రత్యేకంగా తీసుకున్నాం. అర్బినా కుటుంబాన్ని కలవడానికి కొంతమంది అధికారులను పంపించాం. వారికి ఇంకా ఏమైనా అవసరాలు ఉంటే సహాయం చేయాలని నిర్ణయించాం' అంటూ తెలిపారు.(మాజీ సీఎం అజిత్‌ జోగి కన్నుమూత)

ఎస్‌డీ యాదవ్‌ వాదనలు విన్న హైకోర్టు జూన్‌ 3న మరోసారి కేసును పరిశీలిస్తామని పేర్కొన్నారు. అప్పటిలోగా మీరు చెప్పిన ఆధారాలను ప్రత్యేక నివేదిక రూపంలో అందజేయాలని కోరింది. అయితే అర్భినా తండ్రి మహ్మద్‌ నెహ్రూల్‌ స్పందిస్తూ.. 'నా కూతురు ఏ వ్యాధితో బాధపడడం లేదని, కానీ ఆమె మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నా' అంటూ ఆవేదనతో తెలిపాడు. 

మరిన్ని వార్తలు