రాహుల్‌ గాంధీని చిక్కుల్లో పడేసిన పోస్టర్‌

27 Sep, 2018 12:28 IST|Sakshi
రాహుల్‌ గాంధీతో పాటు పలువురు సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలు, వారి సామాజిక వర్గాలు ఉన్న పోస్టర్‌

పాట్నా : బిహార్‌ రాజధానిలో వెలసిన ఒక పోస్టర్‌ రాజకీయ దుమారం రేపుతుంది. ఈ పోస్టర్‌లో రాహుల్‌ గాంధీతో పాటు పలువురు బిహార్‌ కాంగ్రెస్‌ నేతల ఫోటోలు ఉన్నాయి. ఫోటోలు మాత్రం ఉంటే సమస్య లేదు. కానీ ఆ ఫోటోల మీద సదరు నేతల పేర్లు కాక వారి సామాజిక వర్గాల(కులం) పేర్లు దర్శనమివ్వడంతో కాంగ్రెస్‌ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఇరకాటంలో పడ్డారు. ఈ పోస్టర్‌ చూసిన బీజేపీ నాయకులు ‘రాహుల్‌ గాంధీ కుల రాజకీయాలను ప్రోత్సాహిస్తున్నారం’టూ దుమ్మెత్తిపోస్తున్నారు.

వివరాలు బిహార్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌కు నూతన కార్యవర్గాన్ని నియమించినందుకు కృతజ్ఞతలు తెలపడం కోసం కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఓ పోస్టర్‌ను తయారు చేయించారు. ఈ పోస్టర్‌లో కాంగ్రెస్‌ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, బిహార్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ మదన్‌ మోహన్‌ జాతో పాటు మరి కొందరు సీనియర్‌ నాయకుల ఫోటోలు కూడా ఉన్నాయి. అయితే పోస్టర్‌లో నాయకుల పేర్లకు బదులు వారి సామాజిక వర్గాల పేర్లు ప్రింట్‌ చేయించారు. ఈ క్రమంలో రాహుల్‌ గాంధీ, మదన్‌ మోహన్‌లు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి వారి ఫోటోల మీద ‘బ్రాహ్మణ్‌ సముదాయ్‌’ అని ప్రింట్‌ చేశారు. ఇలానే మిగతా నేతల ఫోటోల మీద వారి సామాజిక వర్గాల పేర్లను ప్రింట్‌ చేశారు.

దాంతో కాంగ్రెస్‌ పార్టీ చర్యలు కుల రాజకీయాలను ప్రేరేపించేలా ఉన్నాయంటూ బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. అంతేకాక ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. అయితే ఈ పోస్టర్ల గురించి కానీ.. బీజేపీ నాయకుల ఆరోపణల గురించి కానీ కాంగ్రెస్‌ నాయకులు స్పందిచకపోవడం గమనార్హం.

మరిన్ని వార్తలు