రాంగ్‌ పార్కింగ్‌కు రూ. 23 వేల జరిమానా

8 Jul, 2019 02:49 IST|Sakshi

ముంబై: రాంగ్‌ పార్కింగ్‌ చేస్తే భారీ జరిమానా విధించేలా బృహన్ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ), ముంబై ట్రాఫిక్‌ పోలీసులు కలిసి కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. నో పార్కింగ్‌ జోన్లలో వాహనాలను పార్క్‌ చేస్తే రూ. 5 వేల నుంచి 23 వేల వరకూ జరిమానా విధించనున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే ద్విచక్ర వాహనాలకు రూ. 5 వేల నుంచి రూ. 8,300 వరకు, నాలుగు చక్రాల వాహనాలకు రూ. 10 వేల నుంచి రూ. 23,500 వరకు జరిమానా విధిస్తారు.

అలాగే మధ్య స్థాయి వాహనదారులకు రూ. 11 వేల నుంచి 17,600 వరకు, లైట్‌ మోటార్‌ వాహనాలకు రూ. 10 వేల నుంచి రూ. 15,100 వరకు, మూడు చక్రాల వాహనాలకు రూ. 8 వేల నుంచి రూ. 12,200 వరకు పెనాల్టీ పడనుంది. వాహనదారులు ఎక్కడపడితే అక్కడ వాహనాలను పార్క్‌ చేస్తున్నారని, దాని వల్లే ట్రాఫిక్‌ జామ్‌ అవుతోందని బీఎంసీ అధికారులు తెలిపారు. తాజా నిబంధనలతో ట్రాఫిక్‌ జామ్‌ తగ్గుతుందన్నారు. జరిమానా వెంటనే చెల్లించకపోతే, రోజురోజుకూ అది పెరుగుతుందన్నారు. ట్రాఫిక్‌ పోలీసులకు తోడుగా విశ్రాంత సిబ్బందిని,  ప్రైవేటు సిబ్బందిని కూడా తీసుకున్నట్లు బీఎంసీ అధికారులు తెలిపారు. పార్కింగ్‌ వసతి ఉన్న ప్రాంతాల్లో మొదట ఈ నిబంధనలు అమలవుతాయని తెలిపారు. ముంబైలో 30 లక్షల వాహనాలున్నట్లు ఓ అంచనా.

మరిన్ని వార్తలు