ఆ మాజీ సీఎం భార్యకు నెలకు రూ.15 లక్షలివ్వాలట

12 Sep, 2016 15:27 IST|Sakshi
ఆ మాజీ సీఎం భార్యకు నెలకు రూ.15 లక్షలివ్వాలట

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మాజీ భార్య పాయల్ అబ్దుల్లా తాను తన బిడ్డల జీవనం కోసం నెలకు రూ.15లక్షల పరిహారం ఇవ్వాలని కోర్టు మెట్లెక్కింది. ప్రభుత్వ నివాసం ఖాళీ చేసిన తర్వాత తాను పిల్లలతో సహా రోడ్డున పడ్డానని, చేతిలో ఒక్క రూపాయి కూడా లేకుండా పోయిందని, తమ పోషణార్ధం నెలకు రూ.15లక్షలు ఇవ్వాల్సిందేనని ఆమె పిటిషన్లో డిమాండ్ చేశారు. అక్బర్ రోడ్డులోని ప్రభుత్వ బంగళాను ఖాళీ చేయించాలని ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన నెల రోజులకే ఆమె ఈ పిటిషన్ వేయడం గమనార్హం.

నిర్వహణా ఖర్చుల కింద తనకు తన ఇద్దరు పిల్లలకు నెలకు రూ.10లక్షలు ఇవ్వాలని, కొత్తగా ఓ నివాసంలో ఉండేందుకు నెలకు రూ.5లక్షలు ఇవ్వాలని ఆమె పిటిషన్లో పేర్కొన్నారు. ప్రస్తుతం పాయల్ తల్లిదండ్రుల దయ వల్ల ఆమె స్నేహితుల ఇంట్లో తలదాచుకుంటున్నారని, వారి జీవితం చాలా దుర్భరంగా  ఉందని పిటిషన్లో చెప్పారు. గతంలో తమకు జెడ్ జెడ్ ప్లస్ కేటగిరి కింద రక్షణ ఉండేదని, ఇప్పుడది కాస్త పోవడంతో భద్రతకు కూడా భంగం ఏర్పడిందని చెప్పారు. అయితే, దీనిపై బదులు ఇవ్వాల్సిందిగా నగరంలోని ఫ్యామిలీ కోర్టు ఒమర్ కు నోటీసులు పంపించింది. కేసు విచారణను అక్టోబర్ 27కు వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు