పీడీపీకి మద్దతుపై గవర్నర్‌కు ఎన్‌సీ లేఖ

14 Jan, 2015 00:54 IST|Sakshi

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో రాజకీయం సరికొత్త మలుపు తిరిగింది. ప్రభుత్వ ఏర్పాటుపై ఎవరూ ముందుకు రాకపోవడంతో రాష్ట్ర అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచి కేంద్రం రాష్ట్రపతి పాలన విధించిన నేపథ్యంలో  నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో 28 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ)కి లాంఛనంగా మద్దతు ప్రకటిస్తూ గవర్నర్ ఎన్.ఎన్. వోహ్రాకు మంగళవారం లేఖ రాసింది.

పార్టీ జమ్మూ ప్రొవిన్షియల్ ప్రెసిడెంట్ దేవేందర్‌సింగ్ రాణా ఈ లేఖను గవర్నర్‌కు జమ్మూలో అందజేశారు. ఈ మేరకు ఎన్‌సీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ‘ట్వీట్’ చేశారు. కాగా, తాజా పరిణామంపై పార్టీలో చర్చించాక స్పందిస్తామని పీడీపీ ప్రతినిధి నయీమ్ అఖ్తర్ తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటు అంశంపై ప్రస్తుతం బీజేపీతో అనధికార స్థాయిలో చర్చలు జరుగుతున్నాయన్నారు.
 

మరిన్ని వార్తలు