కశ్మీర్ పీఠంపై కూటమి

25 Feb, 2015 03:05 IST|Sakshi
కశ్మీర్ పీఠంపై కూటమి

కొలువుదీరనున్న  బీజేపీ-పీడీపీ సంకీర్ణం
ప్రకటించిన అమిత్ షా,  మెహబూబా ముఫ్తీ

 
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో త్వరలోనే బీజేపీ-పీడీపీ కూటమి నేతృత్వంలో ప్రభుత్వం కొలువుదీరనుంది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ప్రకటించారు. రాష్ట్రానికి కొత్త సీఎంగా పగ్గాలు చేపట్టనున్న పీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ముఫ్తీ మొహమ్మద్ సయీద్ బుధవారం ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. గురువారం కూటమి కనీస ఉమ్మడి ప్రణాళిక(సీఎంపీ)ను బహిర్గతం చేయనున్నారు. మార్చి 1న సయీద్ సీఎంగా ప్రమాణం చేయనున్నట్లు సమాచారం.

మంగళవారమిక్కడ అమిత్ షా నివాసానికి వెళ్లిన మెహబూబా ముఫ్తీ ఆయనతో దాదాపు 45 నిమిషాల పాటు సమావేశమయ్యారు. ఈ భేటీలోనే సీఎంపీకి తుది రూపు ఇచ్చారు. అనంతరం ఇరువురు నేతలు మీడియా ముందుకు వచ్చి బీజేపీ-పీడీపీ కూటమి త్వరలోనే జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. వివిధ అంశాలపై చర్చల అనంతరం కనీస ఉమ్మడి ప్రణాళిక ఒక కొలిక్కి వచ్చిందని షా తెలిపారు. మోదీతో సయీద్ భేటీ తర్వాత ప్రభుత్వ ఏర్పాటు ఎప్పుడన్నది ప్రకటిస్తామన్నారు.  ప్రభుత్వ ఏర్పాటుకు ఇన్నాళ్లూ ఉన్న అవరోధాలన్నీ తొలగిపోయినందుకు సంతోషంగా ఉందన్నారు.

కీలకమైన అంశాలపై రెండు పార్టీలు ఒక అంగీకారానికి వచ్చాయని, కూటమికి సీఎంపీ ఎజెండా ఉంటుందని మెహబూబా చెప్పారు. ఇది రాష్ట్రంలో గతంలో కూటములకు భిన్నమని, తొలిసారిగా ప్రజలు, రాష్ట్రం, దేశ ప్రయోజనాల ప్రాతిపదికన కొత్త ప్రభుత్వం ఏర్పడబోతోందన్నారు. 87 స్థానాలున్న అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో పీడీపీ 28 స్థానాలు గెల్చుకొని అతిపెద్ద పార్టీగా అవతరించగా.. 25 సీట్లతో బీజేపీ రెండో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్‌సీ) 15, కాంగ్రెస్12 సీట్లు గెల్చుకున్నాయి.

సీఎంపీలో ఏముంది?: సీఎంపీలోని అంశాలను అధికారికంగా వెల్లడించకపోయినా.. సాయుధ దళాల ప్రత్యేక అధికారచట్టంపై కమిటీ ఏర్పాటుకు ఇరుపక్షాలు అంగీకరించా యి. ఆర్టికల్ 370పై ఆందోళన అక్కర్లేదని బీజే పీ పీడీపీకి అభయమిచ్చింది. పశ్చిమ పాక్ నుంచి శరణార్థులుగా వచ్చిన 25 వేల కుటుంబాలపై మానవతా దృక్పథంతో వ్యవహరించాలని నిర్ణయించినట్లు సమాచారం.
 
ఆరేళ్లు ఆయనే సీఎం!

రాష్ట్రానికి సయీద్ ఆరేళ్లపాటు సీఎంగా కొనసాగుతారని, బీజేపీ నేత నిర్మల్ సింగ్ డిప్యూటీ సీఎంగా ఉంటారని సమాచారం.

>
మరిన్ని వార్తలు