పీడీవీ 'సూపర్ సక్సెస్!

28 Apr, 2014 01:07 IST|Sakshi
పీడీవీ 'సూపర్ సక్సెస్!

ఆకాశంలోనే లక్ష్యాన్ని ధ్వంసం చేసిన పృథ్వీ ఇంటర్‌సెప్టర్ క్షిపణి  తొలి ప్రయోగమే సఫలం
 
బాలాసోర్: విదేశీ క్షిపణి దాడుల నుంచి రక్షణ కల్పించే అద్భుతమైన కవచం ‘బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ (బీఎండీ)’ వ్యవస్థ రూపకల్పనలో భాగంగా మన దేశం మరో గొప్ప ముందడుగు వేసింది. సుదూరం నుంచి దూసుకువచ్చే దీర్ఘశ్రేణి క్షిపణులను ముందుగా గుర్తించి, ఆకాశంలోనే పేల్చివేసే ‘పృథ్వీ డిఫెన్స్ వెహికల్ (పీడీవీ)’ని రక్షణశాఖ ఆదివారం విజయవంతంగా ప్రయోగించింది. దీనిని ప్రయోగించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఒడిశాలోని వీలర్ ఐలాండ్‌లో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) నుంచి ఈ ప్రయోగం నిర్వహించారు. పీడీవీ తొలి ప్రయోగంలోనే పూర్తి స్థాయిలో విజయవంతం కావడంతో రక్షణశాఖలో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు ప్రయోగం వివరాలతో రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) ఒక ప్రకటన విడుదల చేసింది.

 ప్రయోగం జరిగిందిలా..

 పీడీవీ ఇంటర్‌సెప్టర్ క్షిపణితో పాటు బాలిస్టిక్ క్షిపణి తరహాలో మోటార్లతో ప్రత్యేకంగా రూపొందించిన లక్ష్యాన్ని ఈ ప్రయోగంలో వినియోగించారు. ముందుగా.. బంగాళాఖాతం మధ్యలో నిలిపిన నౌకల నుంచి లక్ష్యాన్ని ఉదయం 9 గంటల 7 నిమిషాలకు ప్రయోగించారు. అది బాలిస్టిక్ క్షిపణి తరహాలో తీరప్రాంతం వైపు దూసుకువస్తుండగా... పీడీవీ వ్యవస్థలోని రాడార్లు దానిని ఆటోమేటిగ్గా గుర్తించి అప్రమత్తం చేశాయి. వెంటనే ‘ఐటీఆర్’ నుంచి పృథ్వీ ఇంటర్‌సెప్టర్ క్షిపణి బయలుదేరింది. మైక్రో నావిగేషన్, ఇన్‌ఫ్రారెడ్ వ్యవస్థల సహా యంతో... కొద్ది సేపట్లోనే లక్ష్యాన్ని తుత్తునియలు చేసింది. ఈ మొత్తం వ్యవహారాన్ని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన టెలిమెట్రీ/రేంజ్ స్టేషన్ల ద్వారా శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు పరిశీలించారు. రెండు దశల క్షిపణి రక్షక కవచం ‘బీఎండీ’ వ్యవస్థ ఏర్పాటులో భాగంగా రూపొందించిన ‘పీడీవీ’ అన్ని స్థాయిల్లోనూ, ప్రమాణాల పరంగా పూర్తిగా విజయవంతం అయిందని డీఆర్‌డీవో శాస్త్రవేత్త రవికుమార్ గుప్తా తెలిపారు. ఈ సందర్భంగా పీడీవీ రూపకల్పన, ప్రయోగంలో పాల్గొన్న శాస్త్రవేత్తలను డీఆర్‌డీవో డెరైక్టర్ జనరల్, రక్షణశాఖ మంత్రి శాస్త్ర సలహాదారు అవినాశ్ చందర్ అభినందించారు.
 
పృథ్వీ డిఫెన్స్ వెహికల్ పనితీరు, ప్రత్యేకతలు..

 
2 వేల కిలోమీటర్లకంటే ఎక్కువ సామర్థ్యమున్న బాలిస్టిక్ క్షిపణులు భూవాతావరణంలో దాదాపు 120 నుంచి 250 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణించి.. తిరిగి కిందకు వచ్చి లక్ష్యాన్ని ఛేదిస్తాయి.ఇలా వచ్చే శత్రుదేశ క్షిపణులను ‘పీడీవీ’ 120 కిలోమీటర్ల కంటే ఎత్తులో ఉండగానే గుర్తించి, ధ్వంసం చేస్తుంది.క్షిపణులను గుర్తించే రాడార్లు, పృథ్వీని ప్రయోగించే లాంచ్‌ప్యాడ్ ఆటోమేటిక్‌గా స్పందించేలా పీడీవీ వ్యవస్థకు అనుసంధానమై ఉంటాయి.లక్ష్యాన్ని కచ్చితంగా ఛేదించేందుకు వీలుగా ‘పీడీవీ’లో మైక్రో, ఇనెర్షియల్ నావిగేషన్ పరికరాలు, ఇన్‌ఫ్రారెడ్ (ఐఆర్) సీకర్ ఉంటాయి. ‘పీడీవీ’ భూవాతావరణంలో పై పొరలకు చేరగానే.. వేడిని తట్టుకోవడం కోసం దీనికి అమర్చిన ‘హీట్ షీల్డ్స్’ విడిపోతాయి. వెంటనే ఇన్‌ఫ్రారెడ్ సీకర్ పరికరం పైకి తెరుచుకుని లక్ష్యం దిశగా ‘పీడీవీ’కి మార్గ నిర్దేశనం చేస్తుంది.ఇనెర్షియల్ నావిగేషన్, ఐఆర్ సీకర్‌తోపాటు నియంత్రణ కేంద్రాల సహకారంతో పీడీవీ లక్ష్యాన్ని కచ్చితంగా ఛేదించగలుగుతుంది.
 
 

మరిన్ని వార్తలు