బుల్లెట్లు కురిపిస్తూ.. శాంతి చర్చలా?

26 Jan, 2016 01:33 IST|Sakshi
బుల్లెట్లు కురిపిస్తూ.. శాంతి చర్చలా?

♦ చర్చలు జరగాలంటే హింస ఆగాల్సిందే 
♦ పాకిస్తాన్‌కు రాష్ట్రపతి స్పష్టమైన సంకేతం
♦ అసహనాన్ని నిలువరించాలి  బిల్లులను అడ్డుకోవటం అభివృద్ధిని అడ్డుకోవటమే
♦ గణతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రణబ్ ముఖర్జీ వ్యాఖ్యలు
 
 న్యూఢిల్లీ: ఓ పక్క విశృంఖలంగా బుల్లెట్ల వర్షం కురిపిస్తూ.. మరోపక్క శాంతి చర్చలు జరుపుతామంటే అది సాధ్యం కాదని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు. పొరుగు దేశాలతో భారత్ శాంతియుత పరిస్థితులను కోరుకుంటోందని, చర్చలతో సమస్యలను పరిష్కరించుకోవాలనే భావిస్తోందని పేర్కొన్నారు. అయితే.. ఎడతెరిపి లేకుండా ఉగ్రవాద దాడులు జరిపిస్తూ శాంతిమంత్రం జపిస్తుంటే.. అందుకు అంగీకరించేది లేదని పాకిస్తాన్‌కు స్పష్టం చేశారు. 67వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా సోమవారం సాయంత్రం ప్రణబ్ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.

ఉగ్రవాదం అనేది ఏ విధంగా చూసినా మానవాళిపై జరుగుతున్న యుద్ధమేనని., ఇది ఒక కేన్సర్ వ్యాధిలాంటిదని అన్నారు. ఉగ్రవాదంలో మంచి, చెడు తేడా  ఉండదన్నారు. ‘దేశాల మధ్య వివాదాలు ఉండవచ్చు.  ఇరుగుపొరుగున ఉన్నాం.. మన  విభేదాల పరిష్కారానికి నాగరిక విధానం చర్చల రూపంలో ఉంది. అయితే.. బుల్లెట్ల వర్షం కురిపిస్తుంటే చర్చలు జరపటం సాధ్యం కాదు’ అని అన్నారు. దేశంలో పెరిగిపోతున్న అసహనాన్ని నిలువరించేందుకు అందరూ కలసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థలు, జాతీయ భావనకు అత్యంత ప్రధానమైంది సహనమేనన్నారు. దేశంలో ప్రజలందరికీ న్యాయం, సమానత్వం, లింగవివక్ష లేకుండా చూడటం, ఆర్థిక సమానత్వం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

హింస, అసహనం, నిర్హేతుక శక్తుల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థల్లో అనేక పరిణామాలు సంభవించినా వాటికి ఎదురొడ్డి దేశం ముందుకు దూసుకెళ్తోందని  తెలిపారు. జీఎస్టీ తదితర బిల్లుల ఆమోదం ఆలస్యం కావటాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. నిర్ణయాలు తీసుకోవటంలో ఆలస్యం కావటం దేశాభివృద్ధికి తీరని ఆటంకం కల్పిస్తుందని రాష్ట్రపతి ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో విద్యా ప్రమాణాలు పెరగటంపై ఆనందం వ్యక్తం చేశారు. దేశాభివృద్ధికి దోహద పడే చట్టాల విషయంలో ఏకాభిప్రాయంతో వ్యవహరించాలని.. నిర్ణయాలను త్వరితంగా తీసుకోవటం చట్ట సభల ప్రతినిధుల ప్రథమ బాధ్యత అని అన్నారు. నిరుడు వరదలు, కరవు వల్ల భారత్ తీవ్రంగా ప్రభావితమైందని.. దాని వల్ల వ్యవసాయ ఉత్పత్తులపై ప్రతికూల ప్రభావం పడిందన్నారు. ఆర్థిక స్థాయి, గ్రామీణ ఉపాధులు దెబ్బతిన్నాయని వ్యాఖ్యానించారు. ప్రపంచ ఆర్థిక సంక్షోభం వల్ల నిత్యావసర మార్కెట్లు అనూహ్యంగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ఇన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నప్పటికీ.. దేశ ఆర్థిక వ్యవస్థ సరైన దారిలో పయనించటం ముదావహమన్నారు.

>
మరిన్ని వార్తలు