‘పెన్షన్’ టెన్షన్!

3 Nov, 2016 02:48 IST|Sakshi
‘పెన్షన్’ టెన్షన్!

ఒకే ర్యాంక్.. ఒకే పింఛన్‌పై ఆవేదనతో మాజీ జవాన్ ఆత్మహత్య
ఢిల్లీలో పురుగుల మందు తాగి రాంకిషన్ బలవన్మరణం

 
- రాంమనోహర్ లోహియా ఆసుపత్రి వద్ద హైడ్రామా
- బాధిత కుటుంబాన్ని కలిసేందుకు పలుమార్లు ప్రయత్నించిన రాహుల్
- అడ్డుకున్న పోలీసులు..రెండుసార్లు అరెస్టు
- ఓఆర్‌ఓపీని సరిగా అమలు చేయాలంటూ రాహుల్ డిమాండ్
- కేజ్రీవాల్ అరెస్టు.. మోదీ జవాన్లను మోసం చేస్తున్నారని విమర్శ
- ఎస్‌బీఐ బ్రాంచ్ పొరపాటుతోనే రాంకిషన్‌కు తక్కువ పింఛన్: పరీకర్
 
దేశ రాజధాని హస్తినలో బుధవారం రోజంతా హైడ్రామా నడిచింది. ‘ఒకే ర్యాంకు, ఒకే పింఛన్’ రాజకీయ కాక పుట్టించింది. ఈ పథకం అమలులో తనకు అన్యాయం జరుగుతోందంటూ  రాంకిషన్ అనే మాజీ జవాను బలవన్మరణానికి పాల్పడడంతో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు కేంద్రాన్ని టార్గెట్ చేశాయి. కాంగ్రెస్ నేతలు ఉదయమే రోడ్లపైకి వచ్చి ఆందోళన బాట పట్టారు. రాంకిషన్ మృతదేహాన్ని ఉంచిన రాంమనోహర్ లోహియా ఆసుపత్రికి వెళ్లేందుకు యత్నించిన రాహుల్‌గాంధీ, కేజ్రీవాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
 
 న్యూఢిల్లీ: ‘ఒకే ర్యాంకు, ఒకే పెన్షన్’ (ఓఆర్‌ఓపీ) పథకం అమల్లో లోటుపాట్లపై ఆవేదనతో రాంకిషన్ గ్రెవాల్(70) అనే మాజీ జవాను ఆత్మహత్య చేసుకున్నారు. ఢిల్లీలోని సెంట్రల్ ఏరియాలోని జన్‌పథ్ ప్రభుత్వ భవనాల వెనుక భాగంలో పురుగుల మందు తాగి మంగళవారం రాత్రి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఓఆర్‌ఓపీ అమలుపై జంతర్‌మంతర్ వద్ద జరిగిన ఆందోళనలో రాంకిషన్ క్రియాశీలంగా పాల్గొన్నారు. పథకం అమల్లో లోపాలను సత్వరమే సరిచేయాలని రక్షణ మంత్రిని కలసి వివరించేందుకు ముగ్గురు మాజీ సైనికులతో వచ్చిన రాంకిషన్ ఆత్మహత్యకు పాల్పడటం దేశరాజధానిలో సంచలనం సృష్టించింది. బుధవారం ఉదయాన్నే కాంగ్రెస్ నేతలు రోడ్లెక్కారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఢిల్లీలో రాంకిషన్ మృతదేహం ఉన్న రాం మనోహర్ లోహియా ఆస్పత్రి బయట కాంగ్రెస్, ఆప్ కార్యకర్తల ఆందోళనతో హైడ్రామాకు తెరలేచింది. ఈ నేపథ్యంలో మృతుడి కుటుంబాన్ని కలిసేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. రాంకిషన్ కుమారుడితోసహా అతని బంధువులు 12 మందినీ పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు.

 ఆర్‌ఎంఎల్ ఆస్పత్రి వద్ద ఆందోళన
 రాంకిషన్ మృతదేహాన్ని లోహియా ఆస్పత్రికి తరలించారు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు రాహుల్  రావటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రాహుల్‌ను ఆస్పత్రి లోపలకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు.. భద్రతా కారణాల రీత్యా అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. రాహుల్ ససేమిరా అనటంతో.. అరెస్టు చేసి మందిర్‌మార్గ్ స్టేషన్‌కు తరలించారు. దీనిపై ఆయన మండిపడుతూ.. ‘ఈ విధంగా ప్రజాస్వామ్య దేశాన్ని పాలిస్తామా? మృతుడి కుటుంబ సభ్యులనూ అరెస్టు చేస్తారా? ఇదేనా మోదీ ఇండియా?’ అని  విమర్శించారు. ‘దేశంకోసం పోరాడిన జవాన్లు వారికి న్యాయంగా రావాల్సిన బకాయిల కోసం కూడా పోరాడే పరిస్థితి తీసుకురాకండి. ఓఆర్‌ఓపీని అర్థవంతంగా అమలుచేయండి’ అని కోరారు. జవాన్లపై గౌరవాన్ని మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలన్నారు. 70 నిమిషాల తర్వాత విడుదలైన రాహుల్.. కాంగ్రెస్ నేతలు జ్యోతిరాదిత్య సింధియా, అజయ్ మాకెన్‌లతో కలసి మళ్లీ ఆసుపత్రికి బయలుదేరారు. దీంతో పోలీసులు మళ్లీ అరెస్టుచేసి.. తుగ్లక్ రోడ్‌స్టేషన్‌కు అక్కడి నుంచి తిలక్‌మార్క్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.


 ఆప్ నేతల అరెస్టు.. మృతుని బంధువులను పరామర్శించేందుకు బయలుదేరిన కేజ్రీవాల్‌నూ మధ్యలోనే పోలీసులు అరెస్టు చేశారు.  ‘మోదీ దేశానికి అబద్ధం చెప్పారు. ఓఆర్‌ఓపీ సరిగా అమలయితే.. రాంకిషన్ ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు?’ అని కేజ్రీ ప్రశ్నించారు.  ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను కూడా ఆర్‌ఎంఎల్ ఆస్పత్రి వద్ద పోలీసులు అరెస్టు చేశారు. 5 గంటలకు పైగా పోలీసుల నిర్భంధంలో ఉన్న సీఎం క్రేజీవాల్‌ను బుధవారం అర్థరాత్రి విడుదల చేశారు. (చదవండి : పోలీసుల అదుపులోకి ముఖ్యమంత్రి...విడుదల)


 రాంకిషన్ మానసికస్థితి ఏంటో: వీకే సింగ్
 ‘రాంకిషన్ ఆత్మహత్య కారణమేంటో తెలియదు. కానీ ఓఆర్‌ఓపీని తెరపైకి తెస్తున్నారు. ఆయన మానసిక పరిస్థితేంటో తెలుసుకోవాలి’ అని కేంద్ర మంత్రి, జనరల్ వీకే సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  

 చితగ్గొట్టారు: రాంకిషన్ కుమారుడు
 పోలీసులు తనతోపాటు కుటుంబసభ్యులు 12 మందిని అరెస్టు చేసి చితగ్గొట్టారని ఆత్మహత్య చేసుకున్న రాంకిషన్ కుమారుడు జస్వంత్ తెలిపారు. ‘జైల్లో నన్ను, నా తమ్ముడిని చితగ్గొట్టారు. బూతులు తిట్టారు. మాకు న్యాయం చేయండి’ అని ఓ వీడియోలో వెల్లడించారు.
 
 రాష్ట్రపతి అవార్డు గ్రహీత..

 మృతుడు రాంకిషన్.. జవానుగానే కాదు రిటైరయ్యాకా పోరాడాడు. 28 ఏళ్లు ఆర్మీలో సుబేదార్‌గా పనిచేసి 2004లో రిటైరయ్యాక  సొంతగ్రామమైన హరియాణా భివానీ జిల్లా బామ్లాలో సర్పంచుగా ఎన్నికయ్యారు. గ్రామ పారిశుధ్యంలో గణనీయ ఫలితాలు సాధించినందుకు 2008లో అప్పటి రాష్ట్రపతి చేతుల మీదుగా ‘నిర్మల్ గ్రామ్ పురస్కార్’ అందుకున్నారు.  జంతర్‌మంతర్ వద్ద జరిగిన ఓఆర్‌ఓపీ ఆందోళనల్లోనూ క్రియాశీలంగా పాల్గొన్నారు. పథకం అమలు సమస్యలపై ఇటీవలే ప్రధానికి లేఖ  రాసినట్లు తెలిసింది. వచ్చే ఏడాది పంజాబ్ ఎన్నికల్లో బరిలో దిగనున్న ఫౌజ్‌జనతా పార్టీకి రాంకిషన్ సలహాదారు.
 
 ఎస్‌బీఐ తప్పిదంతోనే: పరీకర్
 ఆత్మహత్య చేసుకున్న మాజీ జవాను రాంకిషన్ ఈ పథకం కింద పింఛను పొందుతున్నారని రక్షణ మంత్రి పరీకర్ వెల్లడించారు. అయితే.. హరియాణాలోని భివానీ ఎస్‌బీఐ బ్రాంచ్ లెక్కల్లో పొరపాటు వల్ల ఆరో వేతన కమిషన్ ప్రకారం కాస్త తక్కువ మొత్తాన్ని అందుకుంటున్నట్లు తేలిందన్నారు. ఓఆర్‌ఓపీ  ప్రకారం రూ.28 వేల పింఛను రావాల్సి ఉండగా, రాంకిషన్‌కు రూ.23 వేలే అందుతోందని తేలింది. విచారణ జరుపుతామన్న పరీకర్.. ఓఆర్‌ఓపీ అమల్లో కేంద్రానికున్న చిత్తశుద్ధి కారణంగానే.. రూ.5,507.47 కోట్లు విడుదల చేసిన విషయాన్ని గుర్తుచేశారు. కాగా, రాహుల్, ఆప్ నేతలపై పోలీసు చర్యలను కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమర్థించారు. సమస్య మరింత తీవ్రం కాకుండా పోలీసులు తక్షణ చర్యలు తీసుకున్నారన్నారు.
 
 ఎడతెగని వివాదం
ఒకే ర్యాంకు-ఒకే పెన్షన్(ఓఆర్‌ఓపీ) పథకం అంటే.. ఒకే ర్యాంకులో పదవీవిరమణ చేసిన, ఒకే సర్వీసు కాలం గల సైనిక సిబ్బందికి.. వారు రిటైరైన తేదీతో నిమిత్తం లేకుండా సమాన పెన్షన్ ఇవ్వడం. ఈ డిమాండ్ ఎందుకు ముందుకు వచ్చిందంటే.. గతంలో రిటైరైన సైనికులకు, ఆ తర్వాత రిటైరైన సైనిక సిబ్బందికి.. వారి ర్యాంకులు(హోదాలు), సర్వీసు కాలం ఒకటే అయినాపెన్షన్లలో భారీ వ్యత్యాసాలు ఉన్నాయి. గతంలో రిటైరైన వారికి.. కొత్తగా రిటైరైన వారికంటే తక్కువ పెన్షన్ లభిస్తుంది.  అయితే.. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల విషయంలోనూ ఇలానే ఉందని.. సైనికోద్యోగులకు మాత్రం ఈ డిమాండ్ ఎందుకన్న ప్రశ్న వస్తుంది. కానీ.. ఇందుకు చాలా కారణాలున్నాయి. అందులో ముఖ్యమైనది తప్పనిసరి పదవీ విరమణ! సైన్యాన్ని ఎల్లవేళలా యువశక్తితో బలంగా ఉంచడానికి సైనిక సిబ్బందిని.. ముఖ్యంగా సాధారణ సిపాయిలకు 15 నుంచి 17 ఏళ్ల సర్వీసుతర్వాత తప్పనిసరి పదవీ విరమణ వర్తింపజేస్తారు.

అంటే వారు 35-37 ఏళ్ల వయసుకే మాజీ ఉద్యోగులవుతారు. ఆ తర్వాతి ర్యాంకులకు కూడా నిర్ణీత వయో పరిమితి రాగానే తప్పనిసరి పదవీవిరమణ అమలవుతుంది. దీంతో కొద్దిమందికే పదోన్నతులు లభిస్తాయి. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల లాగా 58 లేదా 60 ఏళ్ల వరకూ పనిచేసి మెరుగైన ర్యాంకుతో పదవీ విరమణ చేసే అవకాశం అత్యధికులైన సైనికులకు లభించదు. మరో కీలక అంశం.. వేతన సంఘం సిఫారసుల అమలు. 1986లో రిటైరైన సైనిక సిబ్బందికి నాలుగో వేతన సంఘం నిర్ణయించిన వేతనంపై పెన్షన్ లభిస్తుంది. 2012 తర్వాత రిటైరైన సైనిక సిబ్బందికి ఆరో వేతన సంఘం నిర్ణయించిన వేతనం ఆధారంగా పెన్షన్ లభిస్తుంది. ఉదాహరణకు చూస్తే.. 2012కు ముందు రిటైరైన మేజర్ జనరల్ ర్యాంకు మాజీ సైనికోద్యోగి పెన్షన్ రూ. 26,700 ఉంటే.. 2012 తర్వాత రిటైరైన కల్నల్ ర్యాంకు అధికారి పెన్షన్ రూ. 35,841 గా ఉంటుందని సైనికుల చెబుతున్నారు.   

 1973కు ముందు అమలులో...
 1973 ముందు వరకూ సైనిక సిబ్బందికి ఓఆర్‌ఓపీ అమలులో ఉండేది. ఆ ఏడాది అమలు చేసిన మూడో వేతన సంఘం సిఫారసుల్లో భాగంగా ఈ పద్ధతిని మార్చివేశారు.    

 అమలు.. ఆందోళనలు!
 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చాక మాజీ సైనికోద్యోగులు తమ ఆందోళనను తీవ్రం చేయడంతో 2015 సెప్టెంబర్ 6న ఓఆర్‌ఓపీని అమలు చేస్తున్నట్లుమోదీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం అమలు వల్ల ప్రభుత్వానికి రూ. 8,000 కోట్ల నుండి రూ. 10,000 కోట్ల వరకూ అదనపు వ్యయం అవుతుందని, ఇది భవిష్యత్తులో ఇంకా పెరుగుతుందని అంచనా. ఓఆర్‌ఓపీ అమల్లో భాగంగా తొలి వాయిదాలో రూ. 5,500 కోట్లు విడుదల చేసినట్లు మోదీ చెప్పారు. రెండో వాయిదా చెల్లించాల్సి ఉంది. కానీ.. తమ ఆందోళనలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ జవాన్లు అంటున్నారు.
   
 ఇవీ మాజీ జవాన్ల డిమాండ్లు...
► ఓఆర్‌ఓపీ పథకం 2013 ఆధార సంవత్సరంగా 2014 జూలై 1 నుంచి వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. అయితే.. 2014 ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని, ఆధార సంవత్సరంగా 2015ను నిర్ణయించాలని మాజీ జవాన్లు డిమాండ్ చేస్తున్నారు. పథకాన్ని ఐదేళ్లకు ఒకసారి సమీక్షించాలని ప్రభుత్వం ప్రతిపాదించగా, ఏటా సమీక్షించాలన్న ది జవాన్ల డిమాండ్.  స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్న  జవాన్లకు పథకం వర్తించదని ప్రభుత్వం తొలుత పేర్కొంది. అయితే సైనికుల్లో కనీసం 40 % మంది ముందుగా పదవీ విరమణ చేస్తారు. దీంతో సర్కారు ప్రతిపాదన సైనికులను ఆగ్రహానికి గురిచేసింది.ఈ పథకం అమలు కావడానికి ముందు రిటైరన వారికి మాత్రమే ఓఆర్‌ఓపీ వర్తిస్తుందని ప్రభుత్వం చెప్పింది.

► ఈ నేపథ్యంలో ఓఆర్‌ఓపీలోని పలు కోణాలపై అధ్యయనం చేయడానికి పాట్నా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం ఏకసభ్య న్యాయ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఆ కమిటీ గత నెల 27వ తేదీన ప్రభుత్వానికి తన నివేదిక సమర్పించింది.

మరిన్ని వార్తలు