డాక్టర్‌ పక్కన ఉండగానే...

14 Nov, 2018 16:34 IST|Sakshi

చండీగఢ్‌ : ప్రభుత్వాసుపత్రికి వచ్చే రోగుల పట్ల డాక్టర్లు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారో నిరూపించే ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. డాక్టర్‌ పక్కన ఉండగానే ఓ వ్యక్తి చేతికి ప్యూన్‌ కుట్లు వేశాడు. వివరాలు.. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తి రోహతక్‌ ప్రభుత్వాసుపత్రిలో చేరాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన డాక్టర్‌ అతడిని పట్టించుకోకుండా పక్కన కూర్చుండిపోయాడు. సదరు వ్యక్తికి తీవ్ర రక్తస్రావం జరుగుతున్నా చూస్తూ ఉండిపోయాడు. కనీసం ప్రాథమిక చికిత్స కూడా చేయలేదు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న ఆస్పత్రి ప్యూన్‌ని పిలవగా..  గాయపడిన వ్యక్తి చేతికి అతడు కుట్లు వేశాడు. ఈ తతంగాన్నంతా ఆస్పత్రిలో ఉన్న ఓ రోగి బంధువు సెల్‌ఫోన్‌లో రికార్డు చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. దీంతో నవంబరు 10న చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కాగా ఈ ఘటనపై హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ స్పందించారు. రోగుల పట్ల నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్న వైద్యులను ఉపేక్షించబోమని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో డాక్టర్ల సంఖ్యను పెంచేందుకు ఎంబీబీఎస్‌ సీట్లు, మెడికల్‌ కాలేజీల సంఖ్యను పెంచుతుంటే డాక్టర్లు ఇలా ప్రవర్తించడం సరికాదని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు