మమ్మల్ని ప్రజలు అంగీకరిస్తున్నారు!

28 Jan, 2016 20:05 IST|Sakshi
మమ్మల్ని ప్రజలు అంగీకరిస్తున్నారు!

భారతదేశంలో లింగ వివక్ష మెండుగానే కనిపిస్తుంది. ఇక ట్రాన్స్ జెండర్ల విషయంలో చెప్పనే అక్కర్లేదు. ఈ నేపథ్యంలో సమ సమాజ నిర్మాణానికి, స్వేచ్ఛా సమానత్వాలకు... ఊపిరిలూదుతూ యష్ రాజ్  సారధ్యంలో రూపొందిన సిక్స్ ప్యాక్ బ్యాండ్ ఆల్బమ్ ఎంతో ఆదరణ పొందింది. అయితే నిజంగానే జనంలో అంతటి మార్పు వచ్చిందా? హిజ్రాలను సాటి మనుషులుగా గుర్తించి, గౌరవిస్తున్నారా అంటే మాత్రం మిశ్రమ స్పందనే లభిస్తోంది. ఒకప్పటి కంటే ఇప్పుడు కొంత మేలని, భవిష్యత్తులో మరింత మార్పు వచ్చే అవకాశం ఉందన్న ఆశాభావమే వ్యక్తమౌతోంది.

భారతదేశంలో లింగ సమానత్వానికి మద్దతుగా ఇటీవల బ్రూక్ బాండ్ రెడ్ లేబుల్‌తో కలసి, యష్ రాజ్ ఫిల్మ్స్ థర్డ్ జెండర్‌తో ఓ పాటను రూపొందించి  విడుదల చేసిన విషయం తెలిసిందే. తదనంతరం జనంలో కొంత మార్పు వచ్చిందంటున్నారు సిక్స్ ప్యాక్ బ్యాండ్ గ్రూప్. సాటి మనుషులుగా తమను ప్రజలు అంగీకరించడం మొదలు పెట్టారంటున్నారు. ఫర్రెల్ విలియమ్స్ హిట్ సాంగ్ హమ్ హై హ్యాపీ.. సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. ఇంగ్లీష్, హిందీ సాహిత్యాల మేలు కలయికతో రూపొందిన ఆ గీతం కేవలం 20 రోజుల్లోనే సుమారు 15 లక్షల హిట్స్ కొట్టింది.

అంతటి ప్రజాభిమానాన్నిపొందిన ఆ పాటను... మొట్టమొదటిసారి 'సిక్స్ ప్యాక్ బ్యాండ్'  (ట్రాన్స్ జెండర్ బ్యాండ్) ఆల్బమ్ గా యష్ రాజ్ ఫ్మిల్మ్స్ యువ విభాగం రూపొందించి సక్సెస్ అయ్యింది. అనుష్కాశర్మ బ్యాగ్రౌండ్, సోనూ నిగమ్ సహకారంతో రూపొందిన సిక్స్ ప్యాక్ బ్యాండ్ సోషల్ మీడియాలోనూ సక్సెస్ సాధించి యూజర్లను ఆకట్టుకుంది. దీంతో లైకులు, కామెంట్లతో  ట్రాన్స్ జెండర్లకు ఎంతో సపోర్ట్ లభించింది. ఇదే నేపథ్యంలో ఇటీవల సోనూనిగమ్ కలసి నటించిన (సిక్స్ ప్యాక్ బ్యాండ్ తో) 'సబ్ రబ్ దే బందే' మరో ఆల్బమ్ కూడా విడుదలైంది. అయితే ఈ ప్రయత్నం ట్రాన్స్‌జెండర్ల మనోభావాలను ప్రదర్శించగలిగిందా అన్నది మాత్రం ప్రశ్నార్థకమే.

ఈ నేపథ్యంలో ట్రాన్స్‌జెండర్ బ్యాండ్ సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. దేశంలోనే మొదటిసారి లింగమార్పిడి సమాజాన్ని జనం ఆదరించడం తమకు ఎంతో ఆనందంగా ఉందంటున్నారు. తమ సమాజం జనాన్ని ఆనందంగా ఉంచేందుకు, వారి ఆనందంలో భాగం  పంచుకునేందుకు ప్రయత్నిస్తుందని, ఇప్పుడు ఈ ఆల్బమ్ ద్వారా తమలోని ప్రతిభను ప్రదర్శించే అవకాశం ఇవ్వడం ఎంతో సంతోషాన్నిచ్చిందని చెప్తున్నారు... సిక్స్ ప్యాక్ బ్యాండ్ సభ్యురాలు భవికా. ట్రాన్స్ జెండర్ తో వీడియో రూపొందించాలన్న ఆలోచన రావడం తమకు ప్రత్యేక గుర్తింపునివ్వడమేనని, సమాజంలో వచ్చిన మార్పునకు అది తార్కాణమని చెబుతున్నారు.

సిక్స్ ప్యాక్ బ్యాండ్ వీడియో తమకు కల్పించిన అవకాశంతో సమాజంలో వచ్చిన మార్పును ప్రత్యక్షంగా చూడగల్గుతున్నామంటున్న సభ్యులు..  ప్రదర్శన ఇవ్వడం తమకెంతో భయం వేసిందని, కానీ యష్ రాజ్ ఫిల్మ్స్ తమకు ఎంతో సపోర్ట్ ఇచ్చిందని చెప్తున్నారు. ట్రాన్స్ జెండర్ ను మూడో జెండర్ గా సుప్రీం కోర్టు గుర్తించిన తర్వాత... దేశంలోని సగం మంది జనం తమను మనుషులుగా గుర్తిస్తున్నారనీ,  కానీ మిగిలిన వారు ఇంకా అనుమానించడం, భయపడటం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  సమాజంలో బహిష్కరణకు గురౌతున్న తమకు సోషల్ మీడియాలో వస్తున్న ప్రోత్సాహం ముందు ముందు కూడా లభించాలని కోరుకుంటున్నారు.

మరిన్ని వార్తలు