ఆ సిటీలో ఇంకా అంధ విశ్వాసాలు..

11 Oct, 2017 12:53 IST|Sakshi

క్షుద్ర ప్రయోగాలు, చేతబడులపై 40 శాతం మంది నమ్మకం

ఐటీ సిటీలో ఇంకా అంధ విశ్వాసాలు

ఒక సర్వే వెల్లడి 

సాక్షి, బెంగళూరు: ఇది డిజిటల్‌ యుగం. అంతరిక్షంలో సుదూర తీరాలకు రాకెట్లను పంపి రహస్యాలను ఛేదించే దిశగా నేటి మానవుడు సాగుతున్నాడు. వైద్య రంగంలో అద్భుతాలనుసృష్టిస్తున్నాడు. ఇక ఐటీ సిటీ బెంగళూరు కూడా అంతర్జాతీయ స్థాయి ఐటీ–బీటీ హబ్‌గా, టెక్నాలజీ రాజధానిగా వెలుగొందుతోంది. ఇలాంటి నగరంలో కూడా క్షుద్ర ప్రయోగాలు, చేతబడులను నమ్మేవారున్నారంటే ఆశ్చర్యం కలగకమానదు. ఎంతో విద్యావంతులు కూడా ఇలాంటి వాటిని నమ్ముతున్నారన్న విషయం నగరంలోని పీపుల్స్‌ ట్రీ మార్గ్‌ అనే మానసికవైద్యాలయం నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. మంగళవారం అంతర్జాతీయ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సిటీలో ఈ సర్వేను నిర్వహించింది.

సర్వేలో ఏం చెప్పారు?

  •  సర్వే కోసం నగరంలో దాదాపు 500 మంది నుంచి సమాచారం రాబట్టారు. క్షుద్రపూజలు, చేతబడుల కారణంగా మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని మీరు నమ్ముతున్నారా? అనే ప్రశ్నను అడిగారు.
  •  దాదాపు 40 శాతం మంది తాము నమ్ముతున్నామని సమాధానమిచ్చారు. క్షుద్రపూజలు, చేతబడుల వంటి కారణంగా మానసిక ప్రశాంతతను కోల్పోతామని నమ్ముతున్నట్లు చెప్పారు.
  •  అందుకే తాము తరచుగా ఆలయాలకు వెళ్లడం ద్వారా ఇలాంటి వాటి ప్రభావం తమపై పడకుండా చూసుకుంటూ ఉంటామని సమాధానమిచ్చారు. మరో 30 శాతం మంది ఈ విషయంపై తమకు ఏమాత్రం అవగాహన లేదని, అందువల్ల సమాధానం చెప్పలేమని అన్నారు.
  •  మరో 30 శాతం మంది మానసిక సమస్యలనేవి ఒత్తిడి కారణంగా మనిషిలో తలెత్తే సమస్యలు మాత్రమేనని పేర్కొన్నారు. వంశపారంపర్యంగా కూడా కొన్ని మానసిక సమస్యలు వచ్చేందుకు ఆస్కారం ఉంటుందని అభిప్రాయపడ్డారు.

ఇలా ఆలోచించడం దురదృష్టకరం - డాక్టర్‌ సతీష్‌ రామయ్య

కాగా, ఈ సర్వేపై సీనియర్‌ సైక్రియాట్రిస్ట్‌ డాక్టర్‌ సతీష్‌ రామయ్య మాట్లాడుతూ.....‘ఈ సర్వే ద్వారా ఇప్పటికీ విద్యావంతులైన వారు కూడా ఇలాంటి మూఢాచారాలను నమ్ముతున్నారని తెలిసింది. ఇది చాలా దురదృష్టకరమైన పరిణామం. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి నమ్మకాలున్నాయంటే నిరక్షరాస్యత, పేదరికం కారణంగా అని అనుకోవచ్చు. కానీ, బెంగళూరు లాంటి మెట్రో నగరంలోని ప్రజల ఆలోచనా తీరు కూడా అలానే ఉందంటే దీనిపై లోతుగా చర్చించాల్సిన అవసరం ఉందని అర్థమవుతోంది. ప్రజల్లో పాతుకుపోయిన ఇలాంటి భావాలను తొలగించేందుకు స్వచ్ఛంద సంస్థలే కాదు ప్రభుత్వం కూడా శ్రమించాలి’ అని తెలిపారు.

మరిన్ని వార్తలు