పురుగు మందులకు బలవుతున్న రైతులు

28 Apr, 2018 17:33 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పంటలకు పురుగు మందులు కొట్టే క్రమంలో ఏటా దేశంలో ఎంతో మంది రైతులు బలైపోతున్నారు. 2017 సంవత్సరంలోనే మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రంలో 50 మంది రైతులు ఈ మందుల ప్రభావంతో మరణించారు. వారిలో ఎక్కువ మంది మనోక్రోటోఫస్‌ మందులను ఉపయోగించినవారే. వాటిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యంత ప్రమాదకారిగా గుర్తించిన ఫాస్ఫరస్‌ ఉంటుంది. ఈ మందును ఇప్పటికే ఎన్నో దేశాలు నిషేధించాయి. ప్రపంచంలో పలు దేశాలు నిషేధించిన పురుగు మందుల్లో ఇప్పటికీ భారత్‌లో రైతులు కనీసం 99 మందులను వాడుతున్నారు. 

పంటలకు పట్టిన చీడ పీడలను నాశనం చేసేందుకు భారత్‌లో రైతులు ఉపయోగిస్తున్న 260 మాలిక్యూల్‌ రకాల పురుగు మందుల్లో 99 మందులను పలు దేశాలు ఎప్పుడో నిషేధించాయి. వీటిని మన రైతులు ఇప్పటికీ వాడుతుండడమే కాకుండా లైసెన్స్‌లేని నకిలీ మందులను కూడా వాడుతున్నారు. ఈ కారణంగా రైతులు ఎక్కువగా మృత్యువాతకు గురవుతున్నారు. 1968 నాటి ఇన్‌సెక్టిసైడ్స్‌ యాక్ట్‌ కిందనే భారత ప్రభుత్వం పురుగు మందులను ఇప్పటికీ నియంత్రిస్తోంది. ఆధునిక కాలానికి అవసరమైన విధంగా చట్టాన్నిగానీ, విధానాలనుగానీ మార్చుకోలేదు. దేశంలో వ్యవసాయమేమో రాష్ట్రానికి సంబంధించిన అంశం. పురుగు మందులేమో కేంద్రానికి సంబంధించిన విషయం. అయినప్పటికీ ఇరు ప్రభుత్వాలు సమన్వయంతో రైతుల బలిని అరికట్టవచ్చు. 

కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ‘ఇంటిగ్రేటెడ్‌ పెస్ట్‌ మేనేజ్‌మెంట్‌’ విధానం అన్నది ఒకటి ఉంది. దాని ప్రకారం ఎప్పటికప్పుడు రైతులను పురుగు మందుల విషయంలో, ఇతర వ్యవసాయ పద్ధతుల విషయంలో చైతన్యపరచాలి. అందుకోసం రైతులకు ప్రత్యేక తరగతులను నిర్వహించాలి. ఇందుకోసం వ్యవసాయ శాఖ, అధికారులు, సిబ్బంది ఉన్నప్పటికీ రైతులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్న దాఖలాలు కనిపించవు. సిబ్బంది కొరత కారణమైని ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం కూడా చెబుతోంది. ఉద్యాగాలిస్తామంటూ అధికారంలోకి వచ్చినప్పుడు ఖాళీలను భర్తీ చేసుకోవచ్చుగదా! పెస్ట్‌ మేనేజ్‌మెంట్‌ విధానం ప్రకారం తప్పనిసరి అయినప్పుడు మాత్రమే పురుగు మందులను వాడాలి. పురుగులను నివారించేందుకు సాధ్యమైనంత వరకు సహజ పద్ధతులను పాటించాలి. వర్మీ కంపోజ్, వేప నూనెలు వాడడం, నున్నటి రబ్బరు గొట్టాల ద్వారా చేనుకు పట్టిన పురుగులు పడిపోయేలా చేయడం సహజమైన పద్ధతులు. 

సహజమైన పద్ధతులన్నీ విఫలమైన సందర్భాల్లో ప్రభుత్వం చూపించిన మోతాదుల్లోనే రసాయనిక మందులను వాడాలి. ప్రభుత్వం విధానం ప్రకారం ఎరువులు అమ్మే వ్యాపారులు కూడా వాటిని ఎలా వాడాలో రైతులకు విడమర్చి చెప్పాలి. కేవలం లాభాపేక్ష కలిగిన ఎరువుల వ్యాపారులు అలా చేయరు. వారి వద్ద శిక్షణ కలిగిన సిబ్బంది కూడా ఉండరు. ఎరువుల షాపుల్లో వ్యవసాయ బీఎస్సీ చదివిన వారిని ప్రమోటర్లుగా పెట్టుకోవాలని, వారు విధిగా రైతులకు సూచనలు ఇవ్వాలంటే గతేడాది కేంద్ర ప్రభుత్వం ఓ చట్టాన్ని తెచ్చింది. ఎక్కడా ఆ చట్టం అమలవుతున్న దాఖలాలు కనిపించడం లేదు. లాభాపేక్షలేని ప్రభుత్వమే రైతుల సంరక్షణకు కఠిన చర్యలు తీసుకోవాలి. పటిష్ట చట్టాలను పట్టుకురావాలి.

మరిన్ని వార్తలు